ప్రభుత్వాధికారిపై..
సివిల్ సప్లయ్ చైర్మన్ తిట్ల పురాణం
– రికార్డు చేసి సోషల్ విూడియాలో పోస్ట్ చేసిన అధికారి
– వైరల్‌గా మారిన ఆడియో
వరంగల్, జూన్30(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఓ ప్రభుత్వ అధికారిపై విరుచుకుపడ్డారు. సెల్‌ఫోన్‌లో అధికారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆ ఆడియోను రికార్డు చేసిన అధికారి సోషల్ విూడియాలో పోస్టు చేశారు. ఇప్పుడీ ఆడియో వైరల్ అయ్యింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ అనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఫోన్ చేశారు. సంభాషణ మొదలుకాగానే తిట్ల దండకం అందుకున్నారు. తెలంగాణ ఎలా సాధించుకున్నామో, ఆ తరువాత ఎలా అభివృద్ధి చేస్తున్నామో నీకు తెలియదా అంటూ సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు. సమైక్యవాదులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆశయాలకు గండికొడుతున్నారని అధికారులను ఉద్దేశించి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్టేజ్ వన్ కాల్వ నర్సంపేట డివిజన్ పరిధిలోని ఖానాపూర్ మండలంలోని అటవీ ప్రాంతం నుంచి వెళుతోంది. అలాగే ఆ డివిజన్ పరిధిలో దశాబ్దాలుగా అనేకమంది రైతులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్లకు పట్టాలు ఇవ్వడంలోనూ అధికారులు అడ్డుకుంటున్నారని సుదర్శన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. కలెక్టర్ నుంచి ఫైల్ వచ్చినా అధికారులు అడ్డుకోవడానికి ఎవరంటూ పెద్ది ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రభుత్వం మాట వినడం లేదని, ప్రజాప్రతినిధులను లెక్కచేయడం లేదని అంతెత్తున లేచారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ పెద్ద సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మాటలన్నీ విన్న బీట్ ఆఫీసర్ లక్ష్మణ్‌కుమార్ ఆ తరువాత ఈ ఆడియోను సోషల్ విూడియాలో పోస్టు చేశారు. ఇప్పుడిది దుమారం రేపుతోంది.