ప్రభుత్వ ఆదాయం పెరగడమే ప్రగతా?

పన్ను రిటర్న్స్‌ పెరిగితే పురోగతా?

పెట్రో ధరల పెరుగుదల ఏ పురోగతికి సూచనలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): పెద్దనోట్ల రద్దు వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందనీ, ఆదాయపు పన్ను రిటర్న్స్‌ సంఖ్య పెరిగిందనీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఆదాయం ప్రతీ ఏటా పెరుగుతూనే ఉంటుంది. అదొక్కటే ప్రగతికి మార్గం అని భావించలేం. నోట్ల రద్దు వల్ల భారీ విజయం సాధించానని ప్రధాని మోదీభావిస్తున్నా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌ వందకు చేరువ అవుతున్నాయి. రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే 71 రూపాయలకు పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంటే రూపాయి విలువ ఇంతలా పతనం కాదు.ఈ పతనం ఎంతవరకో తెలియదన్న ఆందోళన మాత్రం ఇప్పుడు సామాన్యుల్లో కలుగుతోంది. నాలుగున్నరేళ్ల క్రితం ప్రధాని ఆర్భాటంగా ప్రకటించిన మేకిన్‌ ఇండియా పథకం ఏమైందో తెలియదు కానీ ఆర్థిక పతనం మాత్రం కళ్లకు కడుతోంది. ఎగుమతులు పెరగకుండా దిగుమతులు పెరిగినప్పుడు రూపాయి పతనం అవుతూనే ఉంటుంది. ముడిచమురు ధరలు అసాధారణంగా పెరిగాయని చెప్పడానికి లేదు. నిజానికి యూపీఏ హయాంలోనే ముడిచమురు ధరలు పతాక స్థాయికి చేరాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రోజురోజుకు పెరగడంతో సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారబోతు న్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయం విపరీతాలకు దారితీసిందన్న భావన కించిత్తు కూడా ప్రధాని మోడీలో కనిపించడం లేదు. పెద్దనోట్ల రద్దు, ఆ వెంటనే తీసుకున్న జీఎస్‌టీ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నగదురహిత లావాదేవీలు అని ఆర్భాటం చేసిన తీరు కూడా పేటిఎం లాంటి కొందరికి బాగా ఉపయోగపడింది. అయినా అప్పుడు రూపాయి ఇంతలా పతనం కాలేదు. కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనలో చేయలేనిది తాము నాలుగేళ్లలోనే చేశామని బీజేపీ పెద్దలు చెప్పుకొంటున్నా.. రూపాయి పతనంపై మాత్రం స్పందించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాదాపు రెండేళ్ల క్రితం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వైఫల్యాలే ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. రద్దు అయిన పెద్దనోట్లలో 99.3 శాతం బ్యాంకులలో జమ అయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా తెలియజేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందనే చెప్పవచ్చు. దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని అరికట్టడానికి పెద్దనోట్లను ఉన్నపళంగా రద్దు చేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినప్పుడు ప్రజలు విశ్వసించారు. దేశంలో నల్లధనానికి తావు ఉండదనీ, అవినీతి ఇక ఉండనే ఉండదనీ ప్రజలు భావించారు. ఆ కారణంగానే నోట్ల రద్దు వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు మాత్రం ప్రధాని మోదీకి బాసటగా నిలిచారు. వంద రోజులు ఆగితే అచ్చే దిన్‌ వస్తాయన్న ప్రధాని మాటలను నమ్మారు. 85 శాతం వరకు చలామణిలో ఉన్న పెద్దనోట్లను ఉన్నపళంగా రద్దు చేయడం వల్ల లాభం జరగకపోగా నష్టమే జరిగిందని వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి.పర్యవసానాలను అంచనా వేసుకోకుండా తాను తీసుకున్న నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికీ దేశ ప్రజలకు సంజాయిషీ ఇవ్వడం లేదు. సరికదా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం లేదు. ముఖ్యంగా గ్రావిూణ భారత ఆర్థిక వ్యవస్థ గురించి కనీస అవగాహన లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఇప్పుడు బ్యాంకులపైన నమ్మకం పోయింది. బ్యాంకులలో నగదు డిపాజిట్లు తగ్గిపోయాయి. గ్రావిూణ భారతంలో ఇప్పటికీ నగదు కొరత వేధిస్తూనే ఉంది. బ్యాంకు రుణాల మంజూరీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పి బ్యాంకులపై ఆంక్షలు విధించడంతో, ఇప్పుడు ఆయా బ్యాంకుల యాజమాన్యాలు రుణ మంజూరు విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడుతున్నాయి. అదే సమయంలో మొండి బకాయిల విషయంలో కటువుగా వ్యవహరించవలసిన పరిస్థితి రావడంతో పలు కంపెనీలు దివాలాపక్రియను ఎదుర్కొంటున్నాయి. రాజకీయ అవినీతిని నిర్మూలించకుండా అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించడం సాధ్యం కాదని తేలిపోయింది. దీనిని ప్రజలు ఎలా స్వీకరిస్తారన్నది చూడాలి.

————————–