ప్రభుత్వ ఆఫీసులన్నీ మార్కెట్‌యార్డులు చేస్తాం జాగ్రత్త
భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ హెచ్చరిక
గాజియాబాద్,అక్టోబరు 31(జనంసాక్షి):సాగు చట్టాలపై నిరసనగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను తొలగించే ప్రయత్నం చేయొద్దని భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ కోరారు. బలవంతంగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ధాన్య సేకరణ మార్కెట్లుగా మారుస్తామని హెచ్చరించారు.రైతు ఆందోళనకారులు దిల్లీలోకి ప్రవేశించకుండా దేశ రాజధాని శివార్లలో పలు వరుసల్లో నిర్మించిన వివిధ రకాల బారికేడ్లను పోలీసులు ఇటీవల తొలగించారు. సింఘు, టిక్రీ, గాజీపుర్‌లలో వేల మంది రైతులు గత ఏడాది నవంబరు 26 నుంచి కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన శిబిరాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. రైతులకు నిరసనలు కొనసాగించే హక్కు ఉందని, అయితే నిరవధికంగా రహదారులను దిగ్బంధించరాదని ఈ నెల 21న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో పోలీసులు బారికేడ్లను తొలగిస్తున్నారు. ఇదే క్రమంలో నిరసన శిబిరాలను కూడా తొలగించే అవకాశం ఉందని వార్తలు రావడంతో రాకేశ్ టికాయత్ తాజా వ్యాఖ్యలు చేశారు.