ప్రభుత్వ పథకాల అమలులో కార్యకర్తలే కీలకం

ప్రజల్లోకి పథకాలను తీసుకుని వెళ్లాలి

సక్రమంగా అమలు చేసేలా చూడాలి: ఎర్రబెల్లి

జనగామ,జూన్‌9(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమాపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతు కుటుంబంలో దురదృష్టవశాత్తు యజమాని మృతి చెందితే ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోవద్దనేదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రతీ రైతుకు ప్రభుత్వం రుసుం చెల్లించి బీమా సౌకర్యం అమలు చేస్తోందన్నారు. ప్రతీ రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం వర్తింజేయాలని, రైతు చేతికి బాండ్‌ పేపర్‌ వచ్చే వరకూ వ్యవసాయ శాఖ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే రైతుబంధుతో చెక్కులు అందుకున్న రైతులు ముమ్మరంగా వ్యవసయా పనుల్లో నిమగ్నమయ్యారని అన్నారు. రైతు బంధు పథకంలో అర్హత గల ప్రతీ రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం, పెట్టుబడి చెక్కులు అందించాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి అన్నారు. రెవెన్యూ, రైతు సమన్వయ సమితి సమన్వయంతో పనిచేసి ఈ నెల 25 లోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే దయాకర్‌రావు సూచించారు. ఎలాంటి అవకతవకలు ఉన్నా సరి చేయాలని, నిజమైన రైతుకు అన్యాయం జరిగితే వీఆర్‌వోలే బాధ్యత వహించాలని చెప్పారు. ప్రతీ గ్రామానికి అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.కోటి కేటాయించినట్లు ఎమ్మెల్యే ఎర్రబెల్లి అన్నారు. ఆ పనులు పూర్తి చేయించడంలో ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిర్లక్ష్యం వీడి ఇప్పటికైనా పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రామాల్లో అభివృద్ధిని చూపాలన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, స్మశానవాటికలు మట్టి రోడ్లు ఫార్మేషన్లు పురోగతిలో ఉండగా వెంటనే పూర్తి చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ మరో రూ. 25 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించారని, వాటిని పలు గ్రామాల్లో ప్రాధాన్యతాక్రమంగా పనులు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ అడుగులు వేయిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలైన కల్యాణలక్ష్మి, 24గంటల ఉచిత విద్యుత్‌, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, పేదలకు కేజీ టూ పీజీ విద్య అమలు, డబుల్‌ రోడ్డుల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కేసీఆర్‌ కిట్‌, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పింఛన్లు, రైతులకు పెట్టుబడి రైతుబంధు వంటి పథకాలతో ప్రజల హృదయాల్లో నిలిచారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో టిఆర్‌ఎస్‌ కార్యకర్తల పాత్ర కీలకమని ఎమ్మెల్యే దయాకర్‌రావు అన్నారు. గ్రామాలో పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. పార్టీ అభ్యుతి కి పాల్పడిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన హవిూ ఇచ్చారు.