ప్రభుత్వ పాఠశాలల పటిష్టం కోసం కడియం కృషి: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పనిచేస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక శ్రద్ద కారణంగా రాష్ట్రంలో పాఠశాల విద్య బలోపేతం అవుతోందని, కార్పోరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలపడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నిర్లక్ష్యానికి గురైన ఈ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయించారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఆశించిన మేరకువిద్యాప్రమాణాలు లేవని, అక్షరాస్యత లేదని, విద్యా సంస్థలు పనిచేయడం లేదని, ఇవన్నీ ఇప్పుడు గాడిలో పడ్డాయంటే అందుకు సిఎం కెసిఆర్‌ ఆలోచన, కడియం శ్రీహరి కృషి అన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరికీ తీసిపోని విధంగా తెలంగాణ విద్యార్థులుండాలని, అప్పుడే మనం కలలుగన్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనకు అనుగుణంగానే విద్యాశౄఖ మంత్రిగా కడియం శ్రీహరి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. అప్పుడే మెరుగైన విద్యనందించగలమని, మంచి వసతులు కల్పించగలమని అన్నారు.