ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకోండి

పిల్లలను సర్కార్‌ స్కూళ్లో చేర్పించండి

జనగామ,జూన్‌5(జనం సాక్షి): ప్రభుత్వ బడులల్లో చదివితేనే భవిష్యత్‌ ఉండేలా సీఎం కేసీఆర్‌ చర్యలుతీసుకుంటున్నారని, అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను విధిగా సర్కార్‌ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్‌ కృష్ణారెడ్డి అన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, దానిని వినియోగించుకోవాలన్నారు.తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు సన్న బియ్యం, హెల్త్‌ కిట్‌, పుస్తకాలు బట్టలను ఉచితంగా అందిస్తోందన్నారు. ప్రభుత్వ బడులల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ప్రభుత్వ బడుల్లోనే ప్రతి భ గల ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల విద్య అందుతోందన్నారు.తల్లిదండ్రుల ప్రవర్తన పైనే విద్యార్థుల భవిష్యత్‌ ఆధార పడి ఉంటుందన్నారు. విద్యార్థుల చదువు తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌లు కూడా విద్‌ఆయర్తులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలకు పంపాలన్నారు. ఇదిలావుంటే బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌)కు జనగామ జిల్లా అతి చేరువలో ఉందని, అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో మరింత కష్టపడితే వందశాతం లక్షాన్ని పూర్తి చేసుకోవచ్చని కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. జిల్లాలో కేవలం 4వేల మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, వీటికి కావాల్సిన ముడిసరుకు కొరత ఉన్న దృష్ట్యా పనులు ముందుకు సాగడంలేదని తెలిసిందన్నారు. దీనిని అధిగమించేందుకు ఆయా గ్రామాల్లోనే సిమెంట్‌ రింగ్స్‌, ఇటుకల తయారీని యుద్ధప్రాతిపదికన చేపట్టేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామాల్లో బహిరంగ మల విసర్జనకు వెళ్లకుండా వీవోలు, ఎఫ్‌ఏలు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు.