ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: సీతారాం ఏచూరి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రధాని మోదీ హయాంలో దేశం ధనిక, పేదల అనే రెండు దేశాలుగా విడగొట్టబడ్డదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో పెద్ద రాజకీయ, సామాజిక సంక్షోభాలు కొనసాగుతున్నాయని, ఇందిరా హయాంలో ప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగితే మోదీ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుం దని ఆయన ఆరోపించారు. సీబీఐ లాంటి వాటితో అందర్నీ అణిచివేస్తున్నారని, నియంతృత్వం వైపునకు దేశాన్ని నడిపిస్తున్నారని, మరోవైపు దేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్నారంటూ మోదీపై సీతారాం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ విధానంపై చర్చిస్తున్నామని, వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ కూటముల గురించి చర్చిస్తామని, మా పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనూ లేదని సీతారాం అన్నారు. కాంగ్రెస్‌తో పాటు అన్ని రకాల పొత్తులపైనా పార్టీలో చర్చ జరిగిందని, ఏ చర్చ జరిగినా కూడా అంతిమ నిర్ణయం మాత్రం కేంద్ర కమిటిదేనని ఆయన స్పష్టం చేశారు.