ప్రేమ పెళ్లి పేరుతో మహిళకు వేధింపులు
నిరాకరించడంతో హత్య చేసిన యువకుడు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జనంసాక్షి): తల్లి వయసున్న ఓ మహిళను ప్రేమ పేరిట వేధించి.. పెళ్లి చేసుకోవాలని 27 ఏళ్ల యువకుడు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆ మహిళ పెళ్లికి నిరాకరించడంతో.. ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ సంఘటన ఔటర్ ఢిల్లీలోని నాన్‌గ్లోయి ప్రాంతంలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బీహార్‌కు చెందిన శ్యామ్ యాదవ్(27) నాన్‌గ్లోయిలోని ఓ షూ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న 45 ఏళ్ల మాధురితో యాదవ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలుపెట్టాడు. యాదవ్ వేధింపులు భరించలేని బాధిత మహిళ చివరకు తన ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. అయినప్పటికీ ఆ మహిళను అనుసరిస్తూ వేధిస్తూనే ఉన్నాడు యాదవ్. బుధవారం రాత్రి మాధురి ఇంటికి చేరుకున్న యాదవ్.. ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. మహిళను హత్య చేసినప్పుడు ఆమె కూతురు అక్కడే ఉంది. దీంతో మాధురి కూతురు పోలీసులకు సమాచారం అందించింది. ఈ కేసులో నిందితుడు శ్యామ్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళను చంపడానికి వినియోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



