ఫిబ్రవరి నుంచే పదిశాతం కోటా

వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే పది శాతం కోటాని ఫిబ్రవరి నుంచే అమలు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్‌ అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సంబంధిత మంత్రిత్వ శాఖ చెప్పింది. ఫిబ్రవరి 1, ఆ తర్వాత నుంచి నోటిఫై చేసిన అన్ని ఖాళీల్లో చేసే ఉద్యోగాల భర్తీకి ఈ ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేస్తామని స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు జనవరి 9న పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కుల ఆధారిత 50 శాతం కోటాకు చెందని వాళ్లు, వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్లు ఈ పది శాతం కోటా లబ్దిని పొందుతారు. కుటుంబానికి ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి ఉండాలి. నోట్గి/డ్‌ మున్సిపాలిటీల్లో వెయ్యి చదరపు అడుగుల లోపు ఇల్లు, 100 చదరపు గజాలలోపు ఇంటి స్థలం ఉండాలి. వీటన్నింటికీ కనీసం తహసిల్దార్‌ స్థాయికి తక్కువ కాని అధికారి ధృవీకరణ పత్రాలు ఉండాలన్న నిబంధన విధించారు.