ఫిలిపీన్స్‌లో జలప్రళయం

మనీలా, డిసెంబర్‌5: ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్క సారిగా అతలాకుతలం అయింది. జలప్రళయం అకస్మాత్తుగా విరుచుకుపడింది. వేలాది మందిని నిరాశ్రయులను చేస్తూ, వందలాది మందిని పొట్టనపెట్టుకొంటూ మంగళవారం ఫిలిపీన్స్‌ను భారీ టైఫూన్‌ ముంచెత్తింది. దీనికి బోఫాగా నామకరణం చేశారు. దాదాపు 280 మంది మృతి చెందగా వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. అధికారిక లెక్కల ప్రకారం కేవలం కాంపొస్టెల్లా వ్యాలీలోనే 151 మంది మృతి చెందినట్లు అదికారులు తేల్చారు. వరద భీభత్సానికి పట్టణాలు అతలాకుతలం అయ్యాయి. ప్రజలు భీతావహులై తమను రక్షించండంటూ ఆర్తనాదాలు

చేశారు. అకస్మాత్తుగా వచ్చిపడ్డ వరదల వల్ల కమ్యూనికేషన్లలో అంతరం ఏర్పడిందని, విద్యుత్‌ అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. న్యూబాటాన్‌లో 80 మందిని రక్షించామని అయితే కనీసం 319 మంది గల్లంతయ్యారని చెప్పారు. సహాయకచర్యలు చేపట్టేందుకు ఆర్మీ, అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. తాత్కాలికంగా రెండు అత్యవసర షెల్టర్‌లను ఏర్పాటు చేసినట్లు అదికారులు పేర్కొన్నారు. 45000మంది ఇళ్లు కోల్పోయారని, వారిని ఈ షెల్టర్‌లకు తరలించినట్లు చెప్పారు. పసిఫిక్‌ సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న మరో మూడు పట్టణాలలో 13 మంది మృతి చెందారని, 119 మంది డాబాలపై చిక్కుకున్న వారిని రక్షించినట్లు తెలిపారు.