బాణాసంచాపై కోల్‌కతా హైకోర్టు నిషేధం
కాలుష్య నివారణకే అని స్పష్టీకరణ
కోల్‌కతా,అక్టోబర్29 ( జనం సాక్షి ) : రానున్న పండగల సందర్బంగా బాణాసంచాపై హైకోర్టు ఆంక్షలు విధించింది. దీపావళి, ఛాత్ పూజ, ఇతర పండుగల సందర్భంగా బాణసంచా అమ్మకాలు, వినియోగంపై కలకత్తా హైకోర్టు శుక్రవారం నిషేధం విధించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. కోవిడ్`19 మహమ్మారి నేపథ్యంలో వాయు కాలుష్య నిరోధం కోసం ఈ ఆదేశాలు ఇచ్చింది. దీపావళి, ఛాత్ పూజ, ఇతర పండుగల సమయాల్లో బాణసంచా అమ్మకాలు, వినియోగాలను నిషేధిస్తున్నట్లు జస్టిస్ సబ్యసాచి భట్టాచార్య, జస్టిస్ అనిరుద్ధ రాయ్ డివిజన్ బెంచ్ ఓ పిటిషన్‌పై విచారణ జరిపి, తీర్పు చెప్పింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారి వద్ద నుంచి బాణసంచాను జప్తు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీపావళి, కాళీ పూజల సందర్భంగా పరిమిత సమయంలో ’గ్రీన్’ ్గªర్ క్రాకర్స్‌ను కాల్చుకోవచ్చునని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల ఓ నోటిఫికేషన్ ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో ఈ నోటిఫికేషన్ శూన్యం, రద్దు అయింది.