బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం
కేరళలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
బాలిక ఫిర్యాదుతో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తిరువనంతపురం,అక్టోబర్20 జనంసాక్షి : కేరళలో దారుణం జరిగింది. 17 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో బాధితురాలు విషయాన్ని దాచిపెట్టింది.. ఎట్టకేలకు రెండు వారాల తర్వాత బాలిక విషయం బయటపెట్టడంతో ఆలస్యంగానైనా ఆ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. కేరళలోని కోజికోడ్ జిల్లా కుట్టియాడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 3న బాధిత బాలికను ఆమె స్నేహితుడు స్థానికంగా ఉండే ఓ టూరిస్ట్ స్పాట్‌కు ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన బాలికను రిసార్ట్ లోపలికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించాడు. ఆమె మత్తులోకి జారుకోగానే తన ముగ్గురు స్నేహితులను పిలిచి నలుగురు కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి స్పృహలోకి వచ్చిన బాలికను విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి ఆమె ఇంటి దగ్గర వదిలి వెళ్లారు. అయితే, రెండు వారాల నుంచి మూభావంగా ఉన్న బాలిక ఎట్టకేలకు ధైర్యం చేసి మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులకు జరిగిన ఘోరం గురించి చెప్పింది. దాంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు.