బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసుల

మైనర్లకు వివాహాలు జరిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

ఖమ్మం,జూన్‌20(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో అధికారులు ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక వయసు తక్కువగా ఉందని తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన బాలికకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిశ్చయించారు. అయితే చైల్డ్‌లైన్‌ అధికారులకు ఈ విషయంపై ముందుగానే సమాచారం అందడంతో గ్రామానికి వెళ్లి బాలిక తల్లిదండ్రులను సంప్రదించారు. బాలికకు సంబంధించిన వయస్సుకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన తర్వాత మైనర్‌గా నిర్దారించారు. చిన్న వయసులో వివాహాల వల్ల వచ్చే పరిణామాలను బాలిక తల్లిదండ్రులకు వివరించారు. బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. దీంతో బాలిక వివాహ తతంగాన్ని తల్లిదండ్రులు విరమించుకున్నారు. పెళ్లికి వచ్చిన వారు కూడా గుట్టుచప్పుడు కాకుండా తప్పుకున్నారు. ఇలాంటి వివాహాలు చేస్తే కఠినంగా చర్య తీసుకుంటామని వారు హెచ్చరించారు.