బాహ్యభద్రతలో చైనానే అతిపెద్దముప్పు


` డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌
దిల్లీ,నవంబరు 12(జనంసాక్షి): భారత్‌, చైనాల మధ్య సరిహద్దు సంక్షోభం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పుగా మారిందని డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేర్కొన్నారు. దేశ సరిహద్దులను కాపాడుకునేందుకు గత ఏడాది తరలించిన సైన్యం, ఆయుధ సామగ్రి ఇప్పట్లో తిరిగి రాలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారం విషయంలో విశ్వాస లోపం, అనుమానాలే అడ్డుపడుతున్నాయని వెల్లడిరచారు. ఇదే విషయమై గత నెలలో ఇరు దేశాల మిలిటరీ కమాండర్ల మధ్య జరిగిన 13వ రౌండ్‌ చర్చలు ఎటూ తేలకుండానే ముగిసిన విషయం తెలిసిందే.గతేడాది గల్వాన్‌ లోయలో ఘర్షణలు మొదలు.. ఇరు దేశాలు సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయాల కల్పన, బలగాల మోహరింపు చేపడుతున్నట్లు జనరల్‌ రావత్‌ చెప్పారు. మరోవైపు ఎక్కడైనా.. ఎటువంటి విపత్కర పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అఫ్గాన్‌ విషయమై మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో భద్రతను పటిష్ఠం చేసినప్పటికీ, ఒకవేళ అఫ్గాన్‌లో ఉగ్రశక్తులు మళ్లీ విజృంభిస్తే.. జమ్మూ`కశ్మీర్‌లోని ఉగ్రబృందాలకు ఊతం లభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు చైనాతో.. అటు పాక్‌, తాలిబన్లతో భద్రతాపర సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున.. రెండు వైపులా సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.