బిజెపికి దమ్ముంటే అవిశ్వాసం పెట్టుకోవాలి

బిజెపికి సవాల్‌ విసిరిన  సిద్దరామయ్య
బెంగళూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): బీజేపీ పార్టీకి రాజ్యాంగంపైన, ప్రజాస్వామ్యంపైన ఏమాత్రం గౌరవం లేదని కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సృష్టిస్తున్న గందరగోళమే దీనికి నిదర్శనమని ఆయన పలికారు.  ప్రభుత్వానికి బలం లేదని బీజేపీ భావిస్తుంటే.. అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టుకోవచ్చని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం మధ్యాహ్నాం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడతామని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ -జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. బీజేపీకి, సంకీర్ణ ప్రభుత్వానికి మధ్య రాజకీయం వాడివేడిగా సాగుతున్న విషయం తెలిసిందే.
భారతీయ జనతా పార్టీకి గురువారం కాంగ్రెస్‌ గట్టి సవాల్‌ విసిరింది. కర్ణాటక ప్రభుత్వాన్ని నడిపేందుకు తగిన ఆధిక్యత జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి లేదని బీజేపీ భావిస్తే, అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టడం లేదని సిద్ధరామయ్య ప్రశ్నించారు. గురువారం శాసన సభ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఆరోపించారు. సభలో గందరగోళం సద్దుమణగక పోవడంతో శుక్రవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించనివ్వండి. వాళ్ళని నిరోధిస్తున్నది ఏమిటి? మేం శాసన సభ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం.
వాళ్ళందరూ నలుగురు అసమ్మతి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేపు  వస్తారు. బ్జడెట్‌ను రేపు ప్రవేశపెడతాం. ప్రభుత్వానికి ఆధిక్యత ఉందని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా పాల్గొనాలని సిద్ధరామయ్య విప్‌ జారీ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి బీ ఎస్‌ యడ్యూరప్ప మాట్లాడుతూ కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి ఆధిక్యత లేదు. ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు వాళ్ళకి లేదు. మా నిరసనను రేపు కొనసాగిస్తాంఅని చెప్పారు.
కర్ణాటక బ్జడెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి.