బిసిలకు వ్యక్తిగత రుణాలకు  జాబితా

జనగామ,మే21(జ‌నం సాక్షి): ఈ నెల 24నుంచి 26 వరకు బీసీ లబ్దిదారులను వ్యక్తిగత రుణాలకు ఎంపిక చేయనున్నారు. దేవరుప్పుల మండలంలోని 18గ్రామపంచాయతీల పరిధిలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమామహేశ్వర్‌ తెలిపారు. రుణం కావాలని ఇప్పటికే 865 మంది బీసీ నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగా లబ్దిదారులను ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని అన్నారు. పాతపద్ధతిన లబ్దిదారుల ఎంపిక ఉండదని, ఆయా గ్రామాల్లో ఉపాధికోసం సబ్సిడీతో కూడిన రుణం కావాలని దరఖాస్తు చేసిన వారందరిలో అర్హులు ఎంతమంది ఉన్నా గుర్తించి వారందరి పేర్లు బీసీ సంక్షే మ శాఖకు పంపనున్నట్టు ఆయన తెలిపారు. ఈ రుణాలకు రెండు విభాగా లుగా విభజించి రూ. లక్ష రుణానికి 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల రుణానికి 60శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని ఎంపీడీవో తెలిపారు. మండలంలో ఆంధ్రాబ్యాంక్‌, ఏపీజీవీబీ రెండు బ్యాంకులు ఉండగా ఆయా బ్యాంక్‌ల సర్వీస్‌ ఏరియా గ్రామాలకు సంబంధిత బ్యాంకులు రుణాలు అందజేస్తాయన్నారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి లబ్దిదారుల జాబితా తయారు చేసి జిల్లా కేంద్రానికి పంపనున్నట్టు  తెలిపారు.