బిసిల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌2(జ‌నం సాక్షి): ఏ ప్రభుత్వం చేయని విధంగా నాలుగేళ్ల తెరాస పాలనలో బీసీ అభ్యున్నతి జరిగిందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవం పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆయన ఉద్ఘాటించారు. నాలుగేళ్ల పాలనలో తమప్రభుత్వం బీసీల సంక్షేమానికి చేస్తున్న కృషిని వివరించారు. గత ప్రభుత్వాలు బీసీలను ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకున్నాయే తప్ప వారి సంక్షేమం పట్టించుకోలేదన్నారు. ప్రధాని మోదీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తయినప్పటికీ కేంద్రబడ్జెట్‌లో బీసీల అభ్యున్నతికి కేవలం రూ.1250 కోట్లు కేటాయిస్తే.. తమ ప్రభుత్వం రూ.5072 కోట్లు కేటాయించిందని ఉదహరించారు. ప్రతిపక్షాలు బీసీలకు తమ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారని… ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా రూ.కోట్ల నిధులు వెచ్చిస్తున్న విషయం తెలుసుకోవాలని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో సర్వమతాలు, సకల జనుల ప్రభుత్వం కొనసాగు తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ వంటి పథకాలను ప్రారంభించి ఆడకూతుర్ల పెళ్లిళ్లకు ఆర్థికచేయూత నిచ్చిన ప్రభుత్వం తమదని చెప్పారు. బీసీ పిల్లలకు ఉన్నతవిద్యావకాశాలు కల్పించేదిశగా రాష్ట్రంలో కొత్తగా 119 గురుకులాలను ప్రారంభించామని చెప్పారు. వసతిగృహాల్లో పిల్లల మెస్‌ఛార్జీల పెంపుతో పాటు సన్నబియ్యం పథకం అమలుచేస్తున్నట్లు వివరించారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో భాజపా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని దుయ్యబట్టారు. బీసీలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.