బిహెచ్‌యులో మరోమారు ఉద్రిక్తత

కేసు నమోదు చేసిన పోలీసులు
లక్నో,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): క్యాంపస్‌లో లింగ వివక్షతపై నిరసనలు చేపట్టి సంవత్సరం అయిన సందర్భంగా బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ(బిహెచ్‌యు)లో  యవతులు చేపట్టిన ఓ కార్యక్రమాన్ని వివాదాస్పదం అయ్యింది. వీరిపై  ఎబివిపి చెందిన విద్యార్థులు దాడులకు పాల్పడి, విద్యార్థులను కించపరిచారని ఫిర్యాదు అందింది. దీంతో దీనికి కారణమైన కొంతమందిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పది మంది విద్యార్థుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడంతో పాటు, ఐపిసి సెక్షన్‌లోని 147, 354, 323, 504, 506 కింద కేసులు నమోదు అయ్యాయి. యూనివర్శిటీకి సంబంధం లేని వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం యూనివర్శిటీలోని మాల్వియా గేట్‌ వద్ద హాస్టల్‌ రూల్స్‌, లింగ సమానత్వంపై పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ యువతులు  సాంస్కృతిక కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఎబివిపి విద్యార్థులు, యూనివర్శిటీకి సంబంధం లేనివారు అడ్డుకున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలతో మమ్మల్ని వేధించడంతో నిరసన వ్యక్తం చేస్తుండగా, వారు తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.