– బి.సి స్టడీ ఫోరం రాష్ట్ర చైర్మన్ సాయిని నరేందర్.
ములుగు జిల్లా బ్యూరో,ఆగస్టు 25 (జనంసాక్షి):-
ఆదిమకాలం నుండి ఆధునిక కాలం వరకు సమాజ హితం కోసం ఎన్నో ఆవిష్కరణలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి, ఎంతో శ్రమ చేస్తున్న వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి జరగాలంటే బి.పి మండల్ కమీషన్ సిపార్సులను వెంటనే అమలు పరచాలని బి.సి స్టడీ ఫోరం చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం హనుమాన్ నగర్ లో గురువారం భూపాలపల్లి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన బి.పి మండల్ 104 వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఎన్నో పోరాటాల ఫలితంగా బి.సి ల అభివృద్ధికి బి.పి మండల్ నేతృత్వంలో కమిషన్ వేసారాని, బి.సి ల అభ్యున్నతి జరగాలంటే 40 సిపార్సులను అమలు చేయాలని మండల్ సూచిస్తే అందులో ఒక్కటైన విద్యా, ఉద్యోగాల్లో బి.సి లకు 27 శాతం రిజర్వేషన్ మాత్రమే కల్పించి మిగతా 39 సిపార్సులను నేటికి అమలు చేయలేదని అన్నారు. బి.పి.మండల్ సిపార్సులను అమలు చేయాలని గత 30 ఏండ్లుగా బి.సి లు ఎన్ని పోరాటాలు చేసిన ఆధిపత్య వర్గాల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మండల్ కమీషన్ సిపార్సుల అమలు కోసం, బి.సి జనగణన కోసం, చట్టసభల్లో బి.సి లకు రిజర్వేషన్ కోసం బి.సి లు పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఐక్యంగా పోరాటం చేయాలని నరేందర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బి.సి.స్టడీ ఫోరం భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చేపూరి ఓదెలు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఎంజాల మల్లేషం, రాష్ట్ర అధ్యక్షులు నడిపెళ్లి చంద్రం, రాష్ట్ర కార్యదర్శి తేలు సారంగపాణి, చెలివేముల రాములు, జిల్లా నాయకులు కానుగంటి రవి, ఎంజాల రాజయ్య, ఎంజాల రవి బి.ఎల్.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పటేల్ వనజక్క, ఎం.ఎస్.పి జిల్లా కన్వీనర్ గట్ల రాజయ్య, విజయ్యపల్లి సర్పంచ్ మాచర్ల ఐలయ్య లు పాల్గొని మాట్లాడారు. బి.సి. ల ఐక్యతతోనే ఏదైనా సాధించివచ్చని, మన హక్కుల కోసం పూలే, నారాయణ గురు, సాహు మహారాజ్, అంబేడ్కర్, బి.పి మండల్ లాంటి వాళ్ళు ఎన్నో అవరోధాలను ఎదుర్కొని పోరాటం చేసి ఎన్నో హక్కులు కల్పించారని వారి వారసులుగా బి.సి ల మంతా ఏకమై పోరాటం చేసి మన హక్కులను సాధించుకోవాలని, అంతిమంగా రాజ్యాధికారాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. అధికారం, ఆత్మగౌరవం పోరాటం ద్వారానే సాధ్యమవుతుందని ఆ దిశగా సాగే పోరాటంలో బి.పి మండల్ ఆదర్శంగా అందరూ కలసి రావాలని వారు పిలుపునిచ్చారు.