బీమా కంపెనీలకు ధీమా..!
– మధ్యంతర బడ్జెట్‌లో పీఎస్‌యూలకు ఊతమిచ్చే అవకాశం
న్యూఢిల్లీ, జనవరి28(జనంసాక్షి) : త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో పీఎస్‌యూలకు ఊతమిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ బడ్జెట్లో రూ.4,000కోట్ల మేరకు ప్రభుత్వ రంగబీమా సంస్థలకు కేటాయింపులు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశంలోని మూడు ప్రధాన బీమా కంపెనీలకు మూలధన నిధుల కింద రూ.4,000 కోట్లు అవసరమని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పటికే పేర్కొంది. ఈ కంపెనీల్లో నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఇది చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో బీమా కంపెనీలకు కష్టకాలం నడుస్తోంది. ప్రైవేటు రంగ కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా చాలా ఆర్థిక ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. క్లెయిమ్‌ల రేటు పెరగటం ఈ కంపెనీల లాభాలపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే మూడు ప్రధాన బీమా రంగ కంపెనీలను విలీనం చేస్తామని గత బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ మూడు కంపెనీలు కలిపి 200 రకాల బీమా సేవలను అందజేస్తున్నాయి. వీటి ప్రీమియం మొత్తం ఏటా రూ.41,461కోట్లు. 35శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీల వద్ద ఉంది. ఈ నేపథ్యంలో మూడు కంపెనీల విలీనం తర్వాత ఏర్పడే
కంపెనీ విలువ రూ.1.5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చు.