బీహార్‌ సర్కార్‌పై సుప్రిం ఆగ్రహం

– సంరక్షణాలయాల వివరాలు వెంటనే అందజేయండి

– ఆదేశించిన న్యాయస్థానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : చిన్నారులను ఉంచే సంరక్షణాలయాలకు సంబంధించిన వివరాలను ఇంతవరకు సమర్పించలేదని గురువారం సుప్రీం కోర్టు బీహార్‌ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వాటి వివరాలు అందజేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ముజఫర్‌పూర్‌ సంరక్షణాలయంలో యువతుల పై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన కేసు విచారణను ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టుకు బదిలీచేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈకోర్టు ఆరు నెలల్లో ఈ కేసు విచారణను ముగించనుంది. ఇక జరిగింది చాలు. విూవద్ద ఆశ్రయం పొందిన పిల్లలకు ఇలాంటి పరిస్థితి రానీకుండా చూడాలని, అసలు బిహార్‌లో ఎన్ని సంరక్షణాలయాలు ఉన్నాయి? అక్కడ ఎంతమంది ఆశ్రయం పొందుతున్నారు? వాటి నిర్వహణకు ఎన్ని నిధులు పొందుతున్నారు? ప్రస్తుతం అక్కడున్న పిల్లల పరిస్థితి ఏమిటీ?’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తోన్న న్యాయవాది రేపటి వరకు సమయం కోరగా.. విూరు వీటికి సమాధానాలు చెప్పే పరిస్థితిలో లేకపోతే, ఆ అంశాన్ని పరిశీలించే సంబంధిత వ్యక్తిని హాజరు పర్చండని సూచించింది. ఢిల్లీ నుంచి పట్నాకు రెండు గంటల ప్రయాణ సమయం, చీఫ్‌ సెక్రటరీని ఇక్కడకు తీసుకురాగలం అని గొగొయ్‌ ఘాటుగా హెచ్చరించారు. ఈ కేసును బిహార్‌ సీబీఐ కోర్టు నుంచి ఢిల్లీకి రెండు వారాల్లోగా బదిలీ చేయనున్నామని వెల్లడించారు. ఎన్‌జీవో నడుస్తోన్న ముజఫర్‌పూర్‌ సంరక్షణాలయంలో బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడ్డారని, అసభ్యకరమైన పాటలకు బలవంతంగా నృత్యాలు చేయించారని సీబీఐ గతంలో జరిగిన విచారణ సమయంలో కోర్టుకు వెల్లడించింది. ఈ కేసులో ప్రముఖ వ్యక్తుల హస్తముందని, దీని నిర్వాహకుడు బ్రజేష్‌ ఠాగూర్‌ను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సీబీఐ అభియోగపత్రాలు దాఖలు చేసింది.