బుస్సాపూర్‌ అభివృద్దికి కృషి

దత్తగ్రామంగా ఎంపి ప్రకటన

వరంగల్‌,జూన్‌2(జ‌నం సాక్షి): గోవిందరావుపేట మండలంలో లక్నవరం జలాశయానికి వేళ్లే మార్గంలో ఉన్న బుస్సాపూర్‌ గ్రామాన్ని సన్‌సద్‌ ఆదర్శ గ్రామంగా తను దత్తత తీసుకొంటానని మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ ప్రకటించారు. బుస్సాపూర్‌ గ్రామంలో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రామసభకు హాజరైన ప్రజలతో మాట్లాడారు. గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ది చేస్తానని అన్నారు గోవిందరావుపేట మండలంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ. కోటితో ఏర్పాటు చేస్తున్న జింకల పార్కును పర్యాటకులకు కనువిందు చేసే విధంగా తీర్దిదిద్దుతున్నామని అన్నారు. నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని సీతారాంనాయక్‌ చెప్పారు. లక్నవరం జలాశయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేస్తున్న జింకల పార్కు అభివృద్ధి పనులను జయశంకర్‌ జిల్లా అటవీశాఖాదికారి రవికిరణ్‌తో కలిసి పరిశీలించారు. ప్రకృతి అందాలకు నెలవైన జిల్లాలో పర్యటకుల కోసం ఇంకా ఏదో చేయాలని తపించినప్పుడే జింకల పార్కు ఆలోచన తట్టిందన్నారు. ఆలోచన పుట్టిందే తగవుగా డీఎఫ్‌ఓ రవికిరణ్‌తో చెప్పగా ఆలోచనలకు ఒక రూపం వచ్చిందదన్నారు. ఎంపీ లాడ్స్‌ నుంచి తొలుత రూ. 10 లక్షలు మంజూరు చేసి పార్కు నిర్మాణానికి శ్రీకారం పలికానని చెప్పారు. ఆ తర్వాత అటవీశాఖ నుంచి రూ. 50 లక్షలు మంజూరయ్యాయనిపేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా అంచనా వ్యయం రూ. కోటి దాటిపోతుందన్నారు. మొదట జింకల పార్కే అనుకొంటే దానికి తోడుగా చిన్నారుల కోసం చిల్డన్స్‌ పార్కు, సాహస పర్యటకం తదితర అంశాలు తోడయ్యాయని చెప్పారు. మరో రూ. కోటి అవసరమైనా ప్రభుత్వం నుంచి కోట్లాడి తీసుకొచ్చి జింకల పార్కును అత్యంత సుందరంగా తయారు చేస్తామన్నారు. సైక్లింగ్‌ ట్రాక్‌ను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. లక్నవరం జలాశయానికి వెళ్లే రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తానని … ఆ తర్వాత అందుకు అవసరమైన నిధులను కూడా మంజూరు చేయించే బాధ్యత తీసుకొంటానని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొంత మేర రెండు లేన్ల రోడ్డు ఉండగా, బుస్సాపూర్‌ నుంచి జలాశయం వరకు వెళ్లే రోడ్డు పనులు అర్థంతరంగా నిలిచిపోయాయని చెప్పారు. ఈ రోడ్డు పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించే పనులను ప్రారంభించాలని ఆదేశించారు.