బెంగాల్‌లో భాజపాకు షాక్‌పై షాక్‌


` వలసవెళ్లినవారంతా ఘర్‌వాపస్‌
` తృణముల్‌కు క్యూ కట్టిన నేతలు
అగర్తల,అక్టోబరు 31(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరిన నేతలంతా మళ్లీ సొంతగూటికి పయనమవుతున్నారు. తాజాగా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజీవ్‌ బెనర్జీ భాజపాను వీడి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. త్రిపుర రాజధాని అగర్తలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు రాజీవ్‌ బెనర్జీ తృణమూల్‌ను వీడి భాజపాలో చేరారు. ఇటీవలే ఆయనకు భాజపా జాతీయ కార్యవర్గంలో సైతం చోటు కల్పించారు. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన భాజపా కార్యక్రమాల్లో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో భాజపాలో చేరొద్దని దీదీ వారించినా తాను వినలేదని సొంతగూటికి చేరిన సందర్భంగా రాజీవ్‌ పేర్కొన్నారు. ఆమె మాట వినకుండా ఆ పార్టీలో చేరినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందానని చెప్పారు. భాజపా విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాల్లో తాను ఇమడలేనని గ్రహించానన్నారు. మమతా బెనర్జీపై వ్యక్తిగత దూషణలకు దిగొద్దని పలుమార్లు భాజపా అధినాయకత్వానికి సూచించినా తన మాట వినలేదని చెప్పారు. చిన్నపాటి అపార్థం వల్లే అప్పట్లో తాను పార్టీ వీడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.