బైనాక్యులర్‌ ద్వారా గురుద్వారా వీక్షణం


సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు
అమృత్‌సర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  పాకిస్థాన్‌లోని పవిత్ర గురుద్వారా సాహిబ్‌ దర్శనార్థం భారత యాత్రికులు సులభంగా వెళ్లడానికి వీలుగా నడవా ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించిన సందర్భంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవిభజన సమయంలో గురుద్వారా పాక్‌ భూభాగంలోకి వెళ్లింది. దీంతోఈ పవత్ర స్థలాన్ని సందర్వించుకోవాలన్న భారత శిక్కు భక్తులు ఏటా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దశలో ఈ మేరకు రెండు దేశాలు తమ భూ భాగంలో రవాణా, ఇతర వసతులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నడవాకు పాక్‌లో బుధవారం ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ శంకుస్థాపన చేయనున్నారు. అయితే, భారత సరిహద్దు నుంచి గురుద్వారాకు దూరం 4.5 కిలోవిూటర్లే. అయినా, అంతర్జాతీయ సరిహద్దు దాటి వెళ్లేందుకు మార్గం లేదు. అందువల్ల గురుద్వారాను దర్శించుకోవాలనే భక్తులు భారత సరిహద్దు వద్దకు వచ్చి ఎత్తైన ప్రదేశం నుంచి బైనాక్యులర్‌ సాయంతో గురుద్వారాను దర్శించుకుంటున్నారు. ఇందుకోసం సరిహద్దు రక్షక దళం (బీఎస్‌ఎఫ్‌) ఏర్పాట్లు చేసింది.
బైనాక్యులర్‌ నుంచి చూస్తే గురుద్వారా గోపురం మాత్రమే కనిపిస్తుంది. దీన్నే చూసి భక్తులు సంతోషిస్తారు.
నేరుగా దర్శించుకోవాలంటే తొలుత పాకిస్థాన్‌లోని లా¬ర్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి 120 కిలోవిూటర్ల దూరంలోని గురుద్వారాకు ప్రయాణించాలి. ఈ నేపథ్యంలో భారత సిక్కు యాత్రికులు సులువుగా వెళ్లేందుకు వీలుగా డేరా బాబా నానక్‌ పట్టణం నుంచి గురుద్వారాకు నడవా ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలున్నాయి. కానీ వివిధ కారణాలతో అవి కార్యరూపం దాల్చలేదు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారం సందర్భంగా అక్కడికి వెళ్లిన పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు ఆ దేశ సైన్యాధిపతి జావెద్‌ బజ్వా ఈ ప్రాజెక్టుకు సంబంధించి హావిూ ఇవ్వడంతో నడవాపై ఆశలు చిగురించాయి. గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా డేరా బాబా నానక్‌ నుంచి గురుద్వారా కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వరకూ నడవా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన సిద్ధూతో చెప్పారు. ఈ మార్గంలో వచ్చే భారత సిక్కు యాత్రికులు వీసా అవసరం లేకుండా నేరుగా దర్శనం చేసుకొనేలా ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు.