బ్యాకుల విలీనంపై యూనియన్ల ఆగ్రహం
26న సమ్మెకు కన్సార్టియం పిలుపు
ముంబై,డిసెంబర్3(జనంసాక్షి): బ్యాంక్ ఉద్యోగులు మరోమారు సమ్మెకు సిద్దం అవుతున్నారు. మూడు ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తొమ్మిది బ్యాంకుల కన్సార్షియం ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. డిసెంబరు 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించనున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం తెలిపారు. యూఎప్‌బీయూలోని అన్ని యూనియన్లు సమ్మెలో పాల్గొంటాయని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్ 26న దేశవ్యాప్తంగా సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్లు హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే ఈ మూడు ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయించుకుంది. అలాగే ఆయా బ్యాంకులు బోర్డులు కూడా విలీనానికి అంగీకారం
తెలిపాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ ప్రభుత్వ బ్యాంకుల విలీనమైతే దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంక్ ఆవిర్భవించనుంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వరుసగా ఒకటి, రెండో స్థానాల్లో ఉన్నసంగతి తెలిసిందే.