భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి

– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్

ఘనంగా భగత్ సింగ్ 116వ జయంతి వేడుకలు

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 28 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. శుక్రవారం భగత్ సింగ్ 116వ జయంతిని పురస్కరించుకుని చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజారు వద్ద భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 ఏళ్ల నూనుగు మీసాల వయసులోనే పొత్తిల్లోనే పిడికిలి బిగించి స్వాతంత్య్రం నా జన్మ హక్కు అని చాటి చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు దేశం కోసం ఉరికంబాన్ని ముద్దాడి ఇంక్విలాల్ జిందాబాద్ అంటూ దేశం కోసం ప్రాణాలు వదిలిన గొప్ప మహనీయులని, భారత దేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్య వాదులను తరిమికొట్టిన చరిత్ర వారికే దక్కిందని అన్నారు. అలాంటి గొప్ప వీరుల స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు ఈరి భూమయ్య, ఏఐవైఎఫ్ చేర్యాల డివిజన్ నాయకులు గుడెపు సుదర్శన్, కోడిపల్లి రాజు, సనాది బాబు, గుజ్జుక రమేష్, తుమ్మల ప్రభాస్, పల్లెల లచ్చయ్య,ఎండి. షాదుల్లా, తుమ్మ ఇస్తారి, రమేష్, కుమార్, కృష్ణ పాల్గొన్నారు.