భద్రకాళి చెరువు కట్ట నిధులు మేశారు

చేయని పనులకు లెక్కలు చూపారు

కట్టలో పగుళ్లు పట్టించుకోని వైనం

అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు

వరంగల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): ఓరుగల్లులో పేరుగాంచిన భద్రకాళీ అమ్మవారి దేవాలయం వద్ద ఉన్న భదకాళీ చెరువు మిషన్‌ కాకతీయ,కట్ట మరమత్తు పనుల్లో అనేక అవకతవకలు జరుగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు మంజూరైనప్పటికి పనుల్లో నాణ్యత లోపించిందనే విమర్శలున్నాయి.రెండేళ్లలోనే చెరువు పూడిక నిలిపివేత కారణంగా కట్ట పగుళ్లు దర్శనిస్తున్నాయి , వరంగల్‌ అర్బన్‌ లో భద్రకాళీ అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అమ్మవారికి చెంతనే ఉన్న చెరువు నగర ప్రజలకు తాగు నీరందిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువు సామర్ధ్యం పెంచేందుకు 2015 లో మిషన్‌ కాకతీయ కింద పూడికతీతకు ఎంపిక చేశారు. పనులు ప్రారంభించినప్పటికి ఇదే సమయంలో భద్రకాళి చెరువు ట్యాంక్‌ బండ్‌ ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో కట్టమరమత్తు పనులు తూతుమంత్రంగా పూర్తి చేసారనే ఆరోపణలు వస్తున్నాయి. భద్రకాళి చెరువు పూడికతీతకు,కట్ట నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. భద్రకాళీ చెరువులో పూడికతీత పనులు మొదలైనాయో లేదో…. దేవాదుల నీటితో చెరువును నింపేశారు. దీంతో పనులు ఆగిపోయాయి. పూడికతీతకు 4 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. కానీ పనులు పూర్తికాకుండానే తాగు నీటి అవసరాల కోసం చెరువును నింపారు. దీంతో పనులు ఆగిపోయాయి. ఈ నిధుల్లో పనులు జరపకున్నా..జరిగినట్లు బిల్లులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మవారి ఆలయం భక్తుల ఆధ్యాత్మికతను ఇస్తుంటే…… నగర వాసులు సేదదీరేందుకు భద్రకాళీ చెరువు కట్టపై ట్యాంక్‌ బండ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఓ వైపు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెండేళ్లు గడుస్తున్నా పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించటం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది వ్యవహారం. భద్రకాళీ చెరువు సుందరీకణ కోసం 4న్నర కోట్లు కేటాయించినప్పటికీ పనులు జరక్కపోవటంపై ఆగ్రహిస్తున్నారు స్థానికులు. చేయని పనులకు సైతం కాంట్రాక్టర్లు ఇటు అధికారులు కమ్మక్కై…. డబ్బులు నొక్కేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. చేయని పనులకు సైతం బిల్లులు మంజూరు చేయించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండున్నరేళ్ల క్రితం చేసిన పనుల్లో నాణ్యత,లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు. నిధులు మంజూరైనా సదరు కాంట్రాక్టర్లు పనుల విషయంలో ఎందుకు విూనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. నగరంలో అహ్లాదాన్ని పంచేందుకు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం భద్రకాళి కట్ట అభివృద్ధి పనులు అధికారుల నిర్లక్ష్యం..కాంట్రాక్టర్ల కక్కుర్తితో నాణ్యత లోపించింది….కట్టపై పగుళ్లు,నెర్రలు కనిపిస్తున్నాయి..వర్షం పడితే మరింత నష్టం వాటిల్లే అవకాశం మెండుగా కనిపిస్తుంది..అధికారులు స్పందించి చర్యలు చేపడతారో లేదో వేచి చూస్తామని నగర ప్రజలు అంటున్నారు.