భాగస్వామ్య పక్షాలతో ..  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం


– ఏపీ, తెలంగాణల్లోనూ కీలక భూమిక పోషిస్తాం
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : కేంద్రంలో తిరిగి మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్వి రామ్‌మాధవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… మొత్తవ్మిూద 30 ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నడూ లేని రీతిలో మిత్రపక్షాలతో కలిసి 20స్థానాలలో గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సాలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని అన్నారు. వివాదాస్పద ప్రగ్యా సాధ్విని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించడాన్ని రామ్‌మాధవ్‌ సమర్థించుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీలు కూడా బెయిల్‌పై ఉన్నారని.. వారు పోటీ చేస్తున్నట్టుగానూ ప్రగ్యా సాధ్వి కూడా పోటీ చేస్తున్నారని అన్నారు. ఇక.. బీజేపీ ఓటమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు పనిచేశారని.. తాము కూడా టీడీపీని ఓడించే ప్రయత్నం చేశామన్నారు. ఏపీలో తెదేపా అధికారంకు దూరమవుతుందని, ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని రామ్‌ మాదవ్‌ పేర్కొన్నారు. ఏపీలో పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి ఐదేళ్లుగా కేంద్రం అన్ని విధాల సహకరించిందని అన్నారు. ఏపీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని కృసి చేశారని, ఇది ఏపీ ప్రజలకు తెలిసిన విషయమే అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం కావాలనే బీజేపీపై బుదరజల్లుతూ ఎన్నికల్లో లబ్ధికోసం ప్రయత్నించారని రామ్‌ మాదవ్‌ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని అన్నారు. భాజపాలో తెలంగాణలోని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నుంచి కీలక నేతలు చేరారని, ప్రస్తుత నేతలు, కొత్తగా చేరిన నేతలతో పార్టీ ప్రజల్లో బలం పుంజుకుందని అన్నారు.  తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు కృషి చేశామని రామ్‌మాధవ్‌ చెప్పారు.