భాజపా తీర్థంపుచ్చుకున్న జయప్రద

న్యూఢిల్లీ, మార్చి26(జ‌నంసాక్షి) : సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న వేళ చేరికలు, వలసలు జోరందుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె భాజపా కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆమెను యూపీలోని రామ్‌పూర్‌ నుంచి భాజపా బరిలోకి దింపే అవకాశాలు కన్పిస్తున్నాయి. రామ్‌పూర్‌ నుంచి జయప్రద రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆమెను రామ్‌పూర్‌ బరిలో దింపితే గెలుపు ఖాయమని భాజపా వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆమె సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్‌తో తలపడనున్నారు. 1994లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలోకి మారారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై రామ్‌పూర్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జయప్రదను 2010లో సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ పార్టీ తరఫున బిజ్‌నోర్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.