‘భారతరత్న’ పేరుతో..  బీజేపీ అవార్డు రాజకీయాలకు పాల్పడింది

– ప్రణబ్‌పై అంత ప్రేముంటే రెండో టెర్మ్‌ ఎందుకివ్వలేదు?
– భాగస్వామ్యపక్షంపై శివసేన విమర్శలు
న్యూఢిల్లీ, జనవరి28(జ‌నంసాక్షి) : ‘భారతరత్న’ పేరుతో బీజేపీ అవార్డు రాజకీయాలకు పాల్పడిందని ఆ పార్టీ
భాగస్వామ్యపక్షమైన శివసేన నిప్పులు చెరిగింది. స్వాతంత్య సమరయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావార్కర్‌ (వీర సావార్కర్‌) గుర్తుకు రాలేదా? ‘భారతరత్న’ ప్రణబ్‌కు రెండోసారి రాష్ట్రపతి టర్మ్‌ ఎందుకు ఇవ్వలేకపోయారు? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. వీర సావార్కర్‌ను మోదీ సర్కార్‌ ఎందుకు గౌరవించలేకపోయిందని, హిందు రాష్ట్ర ఆలోచన ఆయనదే అన్నారు. సాత్వంత్య్ర పోరాటంలో ఆయన త్యాగాలకు వెలకట్టలేమని, ఇంతచేసినా వీర సావార్కర్‌కు భారతరత్న ప్రకటించడంలో బీజేపీ సర్కార్‌ విఫలమైందన్నారు. మరోసారి ఆ వీరుడికి మొండిచేయి చూపిందని పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగింది. కాంగ్రెస్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీపై బీజేపీకి కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమపై ‘సామ్నా’ నిలదీసింది. ముఖర్జీ ‘భారతరత్న’ అయినప్పుడు, మోదీ, బీజేపీ సర్కార్‌ ఎందుకు ఆయన రెండోసారి రాష్ట్రపతి పదవిలో కొనసాగించలేకపోయిందని ప్రశ్నించింది. ప్రణబ్‌ రాజకీయాల్లో మార్గదర్శి అని, పాలనాధ్యక్షుడని, రాష్ట్రపతిగా తన హయాంలో ఎంతగానో సహకరించారని మోదీ చెబుతుంటారని, మరి అలాంటి గొప్ప వ్యక్తికి రెండోసారి రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చి ఉంటే ఆ ఎన్నిక ఏకగ్రీవమయ్యేది కదా అని నిలదీసింది. ముఖర్జీకి శివసేన మద్దతిస్తామని చెప్పినప్పటికీ ఆయనను కాంగ్రెస్‌ వ్యక్తిగా భావించి బీజేపీ వ్యతిరేకించిందని సంపాదకీయం తప్పుపట్టింది. సార్కర్‌కు భారతరత్న ఇవ్వకపోవడాన్ని ప్రచారాస్త్రంగా బీజేపీ గతంలో వాడుకోలేదా అని కూడా సామ్నా ప్రశ్నించింది. ‘కాంగ్రెస్‌ హయాంలో వీర్‌ సావార్కర్‌ను నిర్లక్ష్యం చేశారని, అవమానించారని, విపక్షంలో ఉన్నప్పుడు ఆ చర్యను ఎండగట్టిన బీజేపీ ఇప్పుడు ఇంతకంటే చేసింది ఏమిటని ప్రశ్నించారు. రామమందిరం కట్టలేదు, సావార్కర్‌కు భారతరత్నా ఇవ్వలేదు. వీర సావార్కర్‌ను మరోసారి దురదృష్టం వెన్నాడిందని సామ్నా సంపాదకీయ పేర్కొంది. భారతరత్న అవార్డులు ప్రకటించగానే సామ్నా ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ సంజయ్‌ రౌత్‌ సైతం ఘాటుగానే స్పందించారు. ‘భారత రత్న ఎవరికి వచ్చింది? నానాజీ దేశ్‌ముఖ్‌, భుపేనే హజారికా, ప్రణబ్‌ ముఖర్జీలను ఇవాళ వరించింది. సావార్కర్‌పై మరోసారి కాలాపానీ చల్లారు. సిగ్గు…సిగ్గు’ అని ఆయన వ్యాఖ్యానించారు.