భారతీయులుగా గర్విద్దాం

75 ఏళ్ల పండుగలో భాగస్వాములు
 అవుదాం
జాతీయ స్ఫూర్తిని ప్రపంచాన్ని చాటుదాం
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , ఆగస్టు 9 :
దేశ స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగస్వాములదమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం
వికారాబాద్ డిపిఆర్సి భవనంలో జరిగిన స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మహిళలకు జెండాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు  జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి,కాలే యాదయ్య, నరేందర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల,జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జడ్పీ సిఈఓ జానకి రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు అని, ప్రజలందరికీ ముందస్తుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.వందల ఏళ్ల తెల్ల వారి పాలనలో అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొని దేశం స్వాతంత్ర్యంపొంది 75 ఏళ్ళు పూర్తి అవుతున్న శుభ సందర్భంలో రాష్ట్రం అంతా అత్యంత వైభవంగా వజ్రోత్సవ వేడుకలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు ఎక్కువ అయ్యాయని, కొంత మంది చరిత్రను వక్రీకరిస్తున్నారని, రానున్న తరాలకు స్వాతంత్ర వీరుల గాధలు, చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మహనీయుని పెరు ఎత్తటానికి అర్హత లేని వారు కూడా నేడు ఏవేవో మాట్లాడుతున్నారని, అందువల్లనే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులకు 552 సినిమా హాళ్లలో మహాత్మ గాంధీజీ చిత్రాన్ని రోజుకు రెండున్నర లక్షల మంది విద్యార్థులు  ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు, రాష్ట్రంలో 22 లక్షల మంది విద్యార్థులు, వికారాబాద్ జిల్లాలో 7120 మంది రోజు చూసేలా ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. వారితో పాటు ప్రతి ఒక్కరూ గాంధీజి చిత్రం చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైటెక్ సిటీలోని హెచ్ఐసిసిలో సోమవారం ఉత్సవాలు ప్రారంభించారని,15 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరా రు. ప్రముఖులు, ముఖ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రమే జెండా ఎగురవేసే అవకాశం ఉండగా నేడు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతున్న మహోత్తర వేళా ప్రతి భారతీయుడు, ప్రతి తెలంగాణ వాది పూర్తి నిబంధనల మేరకు త్రివర్ణ పతాకం ఎగురవేయాలని మంత్రి పిలుపునిచ్చారు.వికారాబాద్ జిల్లాలో 2 లక్షల 47 వేల 692 జెండాలు పంపిణీ చేస్తున్నట్లు, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయలన్నారు. మన సిరిసిల్ల చేనేత నేతన్నలు తయారు చేసిన కోటి 20 లక్షల జెండాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎగురవేయటం ఎంతో గర్వకారణం అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్కరి ముఖంలో చిరు నవ్వు ఉంటేనే నిజమైన స్వాతంత్ర ఫలాలు లభించినట్లు అని భావిస్తూ రాష్ట్రంలో అనేక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. నాడు విద్యుత్ సక్రమంగా రాక ఇబ్బందులు ఉండేవని నేడు 24 గంటల విద్యుత్ తో వెలుగులు నిండాయని, ఇంటింటికి నల్లా ద్వారా నీటిని పంపిణీ చేసి మహిళల నీటి కష్టాలు తీర్చారన్నారు .కల్యాణ లక్ష్మి, షాది ముబారాక్లతో పేద అడబిడ్డల  పెళ్లిళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని, రైతన్నలకు రైతు బంధు, రైతు భీమాతో చేయూత అందుతుందని, రూ.200 ఉన్న పెన్షన్లు రూ. 2వేలకు పెరిగి వృద్ధులకు, వితంతులకు ఆసరా లభించిందన్నారు.
15 రోజుల కార్యక్రమాల్లో భాగంగా రాఖీ పౌర్ణమి రోజు గ్రామ సమాఖ్య తరపున కనీసం 75 మందికి రాఖీలు కట్టి స్వాతంత్ర్య దిన స్ఫూర్తిని చాటాలన్నారు.
రంగోలి లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, స్వయం సహాయక సంఘాల మహిళలు వజ్రోత్సవాలలో ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగుర వేయాలని,  ప్రతి ఒక్కరం జాతి అభివృద్ధికి పునరంకితం అవ్వాలని, దేశ ఐక్యతను చాటాలని కోరారు.
భారతీయులుగా గర్విద్దామని, 75 ఏళ్ల పండుగలో భాగస్వాములమై జాతీయ స్ఫూర్తిని ప్రపంచానికి చాటుదామని ఆమె పిలుపునిచ్చారు.