భారత్‌కు అండగా ఉంటాం

 

– ఉగ్రవాదులను గెలవనివ్వం

– ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌, నవంబర్‌27(జ‌నంసాక్షి) : ముంబయి దాడుల బాధితులకు న్యాయం జరిగేలా చూసేందుకు భారత్‌కు అమెరికా అండగా ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హావిూ ఇచ్చారు. ముంబయిలో 26/11 దాడులు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ట్రంప్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘ముంబయిలో ఉగ్ర దాడులు జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటనలో న్యాయం కోసం చేసే పోరాటంలో అమెరికా భారత ప్రజలకు అండగా ఉంటుంది. దాడుల్లో 166మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. మేము ఉగ్రవాదులను గెలవనివ్వం. కనీసం గెలుపు దగ్గరికి కూడా వెళ్లనివ్వం’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ముంబయి దాడుల్లో భర్తను, పదమూడేళ్ల కూమార్తెను కోల్పోయిన అమెరికా మహిళ కియా షెర్‌ ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. విద్వేషంపై ప్రేమ పైచేయి సాధిస్తుందని ఈరోజు గుర్తుచేస్తుందని, ఈ బలాన్ని ఏ బుల్లెట్‌ కూడా చంపలేదు. ఇదే మా నిజమైన బలమని, ధన్యవాదాలు అని ఆమె వెల్లడించారు. ముంబయి దాడిలో మృతుల జ్ఞాపకార్థం అమెరికాలోని భారత దౌత్యకార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహించారు. మౌనం పాటించి కొవ్వొత్తులు వెలిగించారు. అమెరికాలో భారత దౌత్యాధికారి నవ్‌తేజ్‌ సింగ్‌ సర్నా మృతులకు నివాళులర్పించారు. అంతర్జాతీయ సమాజం పాక్‌పై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ కార్యక్రమానికి అమెరికా ఉగ్రవాద వ్యతిరేక దళం అధికారి హాజరయ్యారు. లష్కరే తోయిబా, ఇతర ఉగ్రవాదులకు శిక్ష పడేలా పాకిస్థాన్‌ చర్యలు తీసుకోవాలని

ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రదాడుల సూత్రధారులకు శిక్ష పడేలా చేయాలని అన్ని దేశాలను అడుగుతున్నామని, ముఖ్యంగా పాకిస్థాన్‌ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముంబయి దాడులు జరిగి పదేళ్లయిన సందర్భంగా దాడికి కుట్ర పన్నిన వారి సమాచారం ఇస్తే 5మిలియన్‌ డాలర్ల రివార్డు ఇస్తామని నిన్న అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.