భారత్‌ గగనతలంపై పాక్‌ హెలికాప్టర్‌

అందులో ఉన్నది పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రధాని

వెల్లడించిన పాక్‌ విూడియా సంస్థ

న్యూఢిల్లీ,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): దాయాది దేశం పాకిస్థాన్‌ మరోసారి గగనతలంలో అతిక్రమణకు దిగింది. ఆ దేశానికి చెందిన ఓ హెలికాప్టర్‌ ఆదివారం భారత గగనతలంలోకి ప్రవేశించిన విషయం కలకలం రేపగా భారత ప్రభుత్వం దర్యాప్తునకు దిగింది. కాగా.. ఆ హెలికాప్టర్‌లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రధాని రజా ఫరూఖ్‌ హైదర్‌ ఖాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్‌ విూడియా సంస్థ ఆజ్‌ న్యూస్‌ పేర్కొన్నట్లు అంతర్జాతీయ విూడియా వర్గాలు తెలిపాయి. పీవోకే ప్రధాని ఫరూఖ్‌ హైదర్‌ ఖాన్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ తరోరీ ప్రాంతంలో ల్యాండ్‌ అవుతుండగా భారత ఆర్మీ కాల్పులు జరిపిందని ఆజ్‌ న్యూస్‌ పేర్కొంది.

ఆదివారం మధ్యాహ్నం 12.13 గంటల ప్రాంతంలో పూంచ్‌ జిల్లాలోని గుల్పూర్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ హెలికాప్టర్‌ ఒకటి భారత గగనతలంలోకి ప్రవేశించింది. అప్రమత్తంగా ఉన్న వాయు గస్తీ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరపడంతో ఆ హెలికాప్టర్‌ వెనుదిరిగింది. ఈ ఘటనతో భారత్‌, పాక్‌ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా.. ఈ ఘటనపై స్పందించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.. ఆ హెలికాప్టర్‌లో ఎలాంటి ఆయుధాలు లేవని చెప్పారు. కాగా.. ఈ హెలికాప్టర్‌ దురుద్దేశపూర్వకంగా వచ్చిందా లేదా పొరబాటున వచ్చిందా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఈ హెలికాప్టర్‌ అనుకోకుండానే భారత గగనతలంలోకి ప్రవేశించి ఉంటుంది అని మేజర్‌ జనరల్‌(రిటైర్డ్‌) అశ్వనీ సివాచ్‌ అభిప్రాయపడుతున్నారు. నావిగేషన్‌ సమస్యల వల్ల ఇలా జరిగి ఉండొచ్చని ఆయన ఓ విూడియాతో మాట్లాడుతూ అన్నారు.