భారత్‌.. శాంతికి కట్టుబడి ఉంటుంది

– అవసరమైన పరిస్థితుల్లో తమశక్తిని వినియోగిస్తుంది
– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
కోయంబత్తూరు, మార్చి4(జ‌నంసాక్షి) : భారత్‌.. శాంతికి కట్టుబడి ఉంటుందని, అయితే.. అవసరమైన పరిస్థితుల్లో తన శక్తిని వినియోగిస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. తమిళనాడులోని సులుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.. ‘అవసరమైన సందర్భాల్లో మన భద్రతా బలగాలు సార్వభౌమత్వ రక్షణ శక్తిని
చూపుతాయన్నారు. మనకు రక్షణగా మన ముందు ఉండే భద్రతా బలగాలు, వైమానిక దళాలు దేశాన్ని రక్షించే క్రమంలో.. పరిష్కార మార్గాలను ప్రతిబింబించేలా పనిచేస్తాయని రాష్ట్రపతి తెలిపారు. ఇటీవల మన వైమానిక దళ సాహసాన్ని చూశామని, ఉగ్రవాద శిబిరాలపై ఐఏఎఫ్‌ దాడులు చేసిందని వ్యాఖ్యానించారు.
భారతీయ వైమానిక దళం ఆధునికీకరణ చెందుతూ వస్తోందని, ఇది మరింత వేగవంతంగా కొనసాగుతుందన్నారు. గతంలో నిస్వార్థపూరితంగా దేశానికి సేవలందించిన వైమానిక దళ సిబ్బందికి, ప్రస్తుతం సేవలందిస్తున్న వారికి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారత్‌ మిమ్మల్ని చూసి గర్వపడుతోందని రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యానించారు. కాగా, జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం సమర్థవంతంగా దాడులు జరిపి, సురక్షితంగా తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి వారి ధైర్య, సాహసాలను కొనియాడారు. అలాగే, ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లోనూ వైమానిక దళం అందిస్తున్న సేవలను కూడా ఆయన ప్రశంసించారు.