భారత క్రికెట్‌కు.. ధోని విలువైన సేవలందిస్తున్నాడు
– రిటైర్మెంట్ అడిగే హక్కు ఎవరికీ లేదు
– పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది
ఇస్లామాబాద్, నవంబర్24(జనంసాక్షి) : భారత క్రికెట్ కు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ చాలాకాలంగా విలువైన సేవలు అందిస్తున్నాడని, ఎవరికి ధోనిని రిటైర్ అవ్వాలని అడిగే హక్కు లేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అన్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో ఒక సారథిగానూ అతను ఎంతో గొప్పగా విజయవంతమయ్యాడని కొనియాడారు. దీనికితోడు వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని అతని అవసరం జట్టుకు ఉందని ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. కొంతకాలంగా బ్యాట్‌తో ధోని పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. మునపటిలా దూకుడుతో వేగంగా ఆడలేకపోతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వచ్చే ప్రపంచకప్ దృష్ట్యా అతనికి రిజర్వ్ వికెట్‌కీపర్ కోసం సెలక్షన్ కమిటీ విండీస్, ఆసీస్‌తో టీ20 సిరీస్‌ల్లో యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా సెలక్షన్ కమిటీ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధోనీ రిటైర్మెంట్ గురించి పలురకాలుగా వార్తలు వచ్చాయి. అయితే రిషబ్ ఎంపిక విషయమై ధోనీ, కెప్టెన్ కోహ్లీ అనంతరం వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో అఫ్రిది మాట్లాడుతూ..’ధోనీ భారత్ క్రికెట్ కోసం ఎంతో చేశాడని, దాని గురించి ఎవరికీ సరిగా తెలియదన్నారు. ఈ క్రమంలో అతనిని రిటైర్ అవ్వాలని అడిగే హక్కు కూడా ఎవరికీ లేదన్నారు. అదేవిధంగా 2019 ప్రపంచకప్‌లో భారత క్రికెట్‌కు అతని సేవలు కీలకం కానున్నాయని అఫ్రీది పేర్కొన్నాడు.