భారాసతో ఎప్పటికీ పొత్తు ఉండదు

` లిక్కర్‌ స్కామ్‌లో కవిత తప్పించుకోలేరు
` ఈ కేసులో ఎవ్వరినీ వదిలేది లేదు
` కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):భారాసతో ఎప్పటీకీ పొత్తు  ఉండదని, భారత్‌లో జరుగుతున్న క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోందని.. అలాగే తెలంగాణ ఎన్నికల సందర్భంగా తనను బ్యాట్స్‌మెన్‌గా అధిష్ఠానం పంపించిందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని  కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. లిక్కర్‌ స్కామ్‌ ప్రతి ఒక్కరి నంబర్‌ వస్తుందని కవితను ఉద్దేశించి అన్నారు. లిక్కర్‌ కేసులో ఢల్లీి డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్‌  సిసోడియానే  విడిచిపెట్టలేదని గుర్తు చేశారు.  కవితను ఎలా విడిచిపెడతామంటూ ఆయన ప్రశ్నించారు.  కవిత పేరు ఢల్లీి లిక్కర్‌ కేసులో ఉందన్నారు. హైదరాబాద్‌లో ఎన్నకిల ప్రచారం కోసం వచ్చిన ఆయన విూడియాతో మాట్లాడారు.  తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్‌ భావిస్తున్నారన్నారు. జాతీయ రాజకీయాలు కేసీఆర్‌ చేద్దామనుకుంటే.. లిక్కర్‌ కేసులో కవిత జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢల్లీికి పంపాడు కేసీఆర్‌ అంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేశారు. ఢల్లీి  లిక్కర్‌ స్కామ్‌ మొదట బయట పడినప్పుడు అనురాగ్‌ ఠాకూరే.. ఎక్కువగా విూడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. దర్యాప్తు సంస్థల కన్నా ముందుగా అనురాగ్‌ ఠాకూరే ఎవరు ఎప్పుడు అరెస్టవుతారు… ఎవరు ఎలా అవినీతికి పాల్పడ్డారో చెబుతూ ఉండేవారు. దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ నా లేకపోతే బీజేపీనా అనే విమర్శలు వచ్చిన తర్వాత వెనక్కి తగ్గారు. సౌత్‌ లాబీ నుంచి  కవిత కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. చార్జిషీట్లు దాఖలు చేశాయి. మిగతా నిందితులు అందర్నీ అరెస్టు చేశారు. వారిలో దాదాపు అందరూ అప్రూవర్లుగా మారారు. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా ఉన్నారు. ఆమె తనపై విచారణ జరగకుండా.. ఈడీ విచారణకు పిలవకుండా.. సుప్రీంకోర్టుకు వెళ్లి  రెండు నెలల పాటు రిలీఫ్‌ తెచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ ఆగింది. నవంబర్‌ నెలలోనే కవిత పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢల్లీి లిక్కర్‌ స్కాంలో  అరవింద్‌ కేజీవ్రాల్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనకు ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ కేజీవ్రాల్‌ విచారణకుహాజరు కాలేదు. హాజరు అయితే అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన హాజరు కాలేదని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నానని..  అది తప్పుడు కేసు అని ఈడీకి లేఖ రాసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈడీ ఈ కేసులో ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా  మారింది. ఈ క్రమంలో అనురాగ్‌ ఠాకూర్‌.. కవితనూ వదిలేది లేదని హెచ్చరికలు జారీ చేయడం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది.