భూకంపం లాగా భారీ ప్రకంపనలు

స్థానికుల ఆందోళన..ఇళ్లలో ఎగిరిపడ్డ వస్తువులు

ఫైరింజన్లు ఆర్పుతున్నా అదుపులోకి రాని మంటలు

భీతావహంగా పరిసర ప్రాంతాలు

వరంగల్‌,జూలై4(జ‌నం సాక్షి ): కోటి లింగాల వద్ద భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సవిూప ప్రాంతాల ప్రజలు ఉలిక్కి పడ్డారు. కొందరి ఇళ్లలో భూకంప తీవ్రత లాగా వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయిన చెబుతున్నారు. భారీ భూకంపం వచ్చిందని భయపడ్డామని స్థానికులు తెలిపారు. శబ్దం ధాటికి ఉలిక్కి పడ్డామని అన్నారు. వెంటనే ఇళ్లలోంచి బయటకు పరుగుల తీసామని కొఓందరు చెప్పారు. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నా బాణసంచా తయారీ గోదాములో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పది మంది కార్మికులు సజీవదహనం కాగా మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేసేందుకు సిబ్బంది యత్నిస్తుంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తుంది. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమవారు ఎవరున్నారా అంటూ మృతుల కుటుంబాల వారు రోదనలతో అక్కడికి చేరుకున్నారు. ఉదయం గోదామును శుభ్రం చేసేందుకు 20 మందికి పైగా కార్మికులు లోపలికి వెళ్లారు. కాసేపటికే గోదాములో మంటలు చెలరేగాయని అంటున్నారు. ఈ ప్రమాదం నుంచి 8 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. బాణాసంచా ఇంకా పేలుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గోదాం పరిసర ప్రాంతాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. బాణాసంచా పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లోని పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్‌ హరిత, సీపీ రవీందర్‌ తో పాటు పలువురు పరిశీలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద మొత్తంలో పటాకులు పేలినట్లు తెలిపారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.