మత్తడివాగుతో తీరనున్న సమస్యలు

అదనపు సాగుకు అనుకూలం
ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): జిల్లాలోని తాంసి మండలం వడ్డాడి సవిూపంలో నిర్మించిన మత్తడివాగు ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణంతో 1200 ఎకరాలకు సాగునీరు అందనుంది. జిల్లాలోని తాంసి, ఆదిలాబాద్‌, జైనథ్‌ మండలాల రైతుల భూములకు సాగునీరు అందించేందుకు తాంసి మండలం వడ్డాడిలో 2004లో మత్తడివాగు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2008 ఆగస్టులో ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయి. ఈ కాలువ ద్వారా వడ్డాడి, కప్పర్ల, బండలనాగాపూర్‌, జామిడి, చాందా`టి. సిర్సన్న, భోరజ్‌, సావర్‌గాం, తరోడ, మల్లాపూర్‌ భీంసరి, జందాపూర్‌ గ్రామాల్లోని 8500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా పనులు చేపట్టారు. ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణంతో 1200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. రైతులు పంటలు సాగుచేసే ప్రతి ఎకరానికి సాగునీరు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే మిషన్‌కాకతీయ ఫథకంలో భాగంగా చేపట్టిన చెరువుల మరమ్మతుల కారణంగా జిల్లాలోని రైతులు రెండు పంటలను సాగు చేసుకుంటున్నారు. ప్రాజెక్టుల ఆధునీకీకరణతో ఆయకట్టు భూములు సస్యశ్యామలంగా మారనున్నాయి. రైతులు రెండు పంటలు సాగుచేసుకునే అవకాశాలుండడంతో ప్రభుత్వం ఈ కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.ఈ కాలువ నిర్మాణంతో తాంసి మండలం హస్నాపూర్‌, పొన్నారి, తలమడుగు మండలం ఖోడద్‌ గ్రామాలకు చెందిన రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాలువ నిర్మాణం పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల నేరవేరిందని వారు అంటున్నారు. ఇదిలావుంటే కడెం జలాశయం, గూడెం ఎత్తిపోతల కింద యాసంగిలో సాగు చేస్తున్న రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని కడెం జలాశయం ఈఈ సూచించారు. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు ఆరుతడి పంటలకు మాత్రమే సరిపోతుందన్నారు. కాల్వ కింద ఉన్న రైతులు వరి సాగుచేస్తే కింది రైతులకు నీరందని పరిస్థితి నెలకొంటుందన్నారు. వారబందీ ప్రకారమే నీరు విడుదల చేయనున్నందున వరి సాగు చేసే రైతులు ఆ తర్వాత నీరందక ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటలు సాగు చేసి అధికారులకు సహకరించాలని కోరారు.