మత్స్య పరిశ్రమ అభివృద్దికి 32కోట్లు

ఖమ్మం,జూలై31(జ‌నం సాక్షి): సమగ్ర మత్య్సాభివృద్ధి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.32 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ పట్ల జిల్లాలో చేపల, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తద్వారా నేడు రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా రెండో స్థానంలో నిలిచిందని జిల్లా మత్య్సాభివృద్ది అధికారి ఎన్‌.హనుమంతరావు అన్నారు. మత్య్సకార్మికుల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సవిూకృత మత్స్యా అభివృద్ధి పథకం లబ్ధిదారులను ఎంపిక చేసే విధానంలో పూర్తి పారదర్శకత చేపడుతున్నట్లు తెలిపారు. మత్స్యకార్మికుల సహకార సంఘాలకు ప్రభుత్వ పరంగా అందిస్తున్న సంచార వాహనాలు, లగేజీ ఆటోలు, ఇతర పరికరాలను అందించేందుకు లాటరీ నిర్వహించారు. జిల్లాలో 177 సంఘాలు చేపలవేట వృత్తిపై ఆధారపడి ఉన్నాయన్నారు. వీరి ఆర్థిక అభివృద్ధికి గాను లగేజీ ఆటోల కోసం 217 దరఖాస్తులు రాగా.. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసిట్లు చెప్పారు. మత్య్సకారులకు అవసరమైన ఇతర వాహనాలు, వలలు, ప్లాస్టిక్‌ ట్రేలు, బైకుల తదితర పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ వాటిని అందిస్తామని అన్నారు.