మద్యం తాగి వచ్చినందుకే నెట్టేశారు!

– నేను ఆ విషయాన్ని గుర్తించలేదు
-భాజపా తమిళనాడు అధ్యక్షురాలు సౌందరరాజన్‌
చెన్నై, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధరలపై ప్రశ్నించిన ఓ ఆటోడ్రైవర్‌ను భారతీయ జనతా పార్టీ తమిళనాడు నేత కాళిదాస్‌ నెట్టేసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర భాజపా తమిళనాడు అధ్యక్షురాలు తమిళిసాయి సౌందరరాజన్‌ విూడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. పెట్రో ధరలపై ప్రశ్నిస్తే ఇలా ప్రవర్తిస్తారా? అంటూ ప్రతిపక్ష పార్టీలు, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తమిళిసాయి ఈ ఘటనపై స్పందించారు. ఆ ఆటోడ్రైవర్‌ మద్యం తాగి ఉన్నాడు. అందుకే మా పార్టీ నేత ఆయనను బయటకు నెట్టేశారు. నా చుట్టూ ఉన్న వారు భద్రత విషయంలో ఆందోళన చెందకూడదు. అందుకే ఆయనను అక్కడి నుంచి పంపించారు అని వ్యాఖ్యానించారు. ఆయనను కొడుతున్న సమయంలో నేను నవ్వానని విూడియా చూపెడుతోంది. ఆ సమయంలో విూడియా అడిగిన ప్రశ్ననే ఆ ఆటోడ్రైవర్‌ అడిగాడు. నేను సమాధానం చెబుతున్నాను. నా వెనుక ఏం జరుగుతుందో నేను గుర్తించలేదు అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా, పెట్రో ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే భాజపా నేతలు నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.