మద్యం మత్తులో.. 

మహిళ సీట్లో మూత్రపోశాడు!
– ఎయిరిండియా విమానంలో ఘటన
– విమానయాన శాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రయాణీకురాలి కుమార్తె
– విచారణ జరిపి నివేదికివ్వాలని ఏయిరిండియాను ఆదేశించిన సహాయ మంత్రి
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మహిళ ప్రయాణికురాలు కూర్చున్న సీట్లో ఏకంగా మూత్రం పోసి మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారు.  ఈ ఘటన ఏయిరిండియా విమానంలో  చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మద్యం సేవించిన ఓ వ్యక్తి తాగిన మైకంలో సదరు మహిళ కూర్చున్న సీట్లో మూత్రం పోశాడు. దీంతో సదరు మహిళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆగస్టు 30న ఢిల్లీ నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ప్రయాణికురాలి కుమార్తె ట్విటర్‌ ద్వారా కేంద్ర విమానయానశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికురాలి కుమార్తె మాట్లాడుతూ.. ఆగస్టు 30న ఎయిరిండియా విమానం ఏఐ 102 ఢిల్లీ నుంచి న్యూయార్క్‌ వెళ్లే విమానంలో సీటు నంబరు 36డీలో మా అమ్మ కూర్చుందని, తాగిన మైకంలో ఉన్న వ్యక్తి మా అమ్మ కూర్చున్న సీటు దగ్గరకు వచ్చి మూత్రం పోశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో నా తల్లి ఎంతగానో భయబ్రాంతులకు లోనైందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి అంటూ ప్రయాణికురాలి కుమార్తె ఇంద్రాణి ఘోష్‌ కేంద్రమంత్రులు సురేశ్‌ ప్రభు, సుష్మా స్వరాజ్‌, విమానాయానశాఖ, ఎయిరిండియాను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది. ఈ ఘటన అనంతరం సిబ్బంది సదరు ప్రయాణికురాలిని వేరే సీటులోకి మార్చారు. దీనిపై కేంద్ర విమానాయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా స్పందించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా సిన్హా ఎయిరిండియాను ఆదేశించారు. దీనిపై వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా విమానయాన శాఖ, డీజీసీఏ ఎయిరిండియాను ఆదేశించింది. విూ తల్లికి ఎదురైన దారుణ అనుభవం పట్ల మేం చింతిస్తున్నాం. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం అని సిన్హా ట్వీట్‌ చేశారు.