మమతాకు ఎదురుదెబ్బ


– శారదా కుంభకోణం కేసు దర్యాప్తు పర్యవేక్షణను తిరస్కరించిన సుప్రింకోర్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : శారదా కుంభకోణం కేసులో మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసులో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం లేదని తెల్చిచెప్పింది. ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కాగా శారదా గ్రూప్‌ పేరుతో 200 ప్రయివేటు కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70 లక్షలమంది డిపాజిటర్ల బతుకులు రోడ్లవిూద పడిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలతో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు  శారదా కుంభకోణంతో సంబంధమున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్‌ ఘోష్‌ కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు.