*మరుగుజ్జు దివ్యాంగులకు కేసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి*
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్
మునగాల, సెప్టెంబర్ 17(జనంసాక్షి): అసెంబ్లీలో మరుగుజ్జు దివ్యాంగులను ఉద్దేశించి కించపరిచే విధంగా మాట్లాడిన కేసిఆర్ మరుగుజ్జు దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కెసిఆర్ పై పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మునగాల మండల కేంద్రంలో మండల వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ, అసెంబ్లీ సాక్షిగా మరుగుజ్జు దివ్యాంగులను అవహేళన చేస్తూ “ఎక్కడి నుంచి వచ్చిన్రు ఈ మరుగుజ్జుగాళ్ళు దేశానికి దరిద్రంగా దాపురించారు” అనే పదం రాష్ట్ర ముఖ్యమంత్రి హెూదాలో ఉండి దివ్యాంగుల మనస్సులను గాయపరిచేలా మాట్లాడడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సంస్కారమా అని ప్రశ్నించిన ఆయన ప్రతిపక్షాలను తిట్టాలంటే అనేక పదాలు ఉన్నప్పటికీ దివ్యాంగులలో ఒక తెగను వారి జీవితాలు దరిద్రమైనట్టు అభివర్ణిస్తూ, వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన కేసీఆర్ మరుగుజ్జు దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. 80వేల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుటి మనిషి గురించి మాట్లాడినప్పుడు ఎటువంటి సంస్కారంతో మాట్లాడాలి అనే పుస్తకం చదివినట్టు లేదని, అందుకే సాటి మనిషిపై చులకనగా మాట్లాడుతున్నారని, ఇదివరకు కూడా టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన వనపర్తి సభలో వికలాంగులను కుంటోళ్లకు, గుడ్డోళ్ళకు ఆసరా పింఛన్లు అందిస్తున్నామని అవహేళనగా మాట్లాడిన సీఎం కెసిఆర్ ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పైన 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని అనుసరించి పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని, అప్పుడే ప్రజాస్వామ్యంలో రాజుకు బంటుకు ఒకటే న్యాయమని సామాన్య ప్రజలకు సైతం నమ్మకం కలుగుతుందన్నారు. మునగాల మండలంలోని కృష్ణానగర్ గ్రామంలో వికలాంగుడైన జూకంటి సైదులు ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, వికలాంగులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, రాష్ట్ర నాయకులు లింగం రామలక్ష్మయ్య, సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు జూకంటి సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినబోయిన చిన్నవీరయ్య, పవన్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి పేరేల్లి బాబు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రావి స్నేహలత చౌదరి, జిల్లా నాయకులు నూకపంగు గురవయ్య, వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ నాయకులు కొత్తపల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
|