మరో రికార్డుకు చేరువలో ధోనీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): భారత మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మరో వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేసేందుకు రెడీగా ఉన్నాడు. దశాబ్దంన్నరకు పైగా భారత్‌ తరఫున వన్డేలు, టీ20లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ధోనీనే వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ధోనీ ఇప్పటి వరకు 594 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. మరో మూడు మ్యాచులు ఆడితే ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్‌ కీపర్‌గా మహీ అరుదైన ఘనత అందుకుంటాడు. సొంతగడ్డపై ఈ నెల 24 నుంచి భారత్‌ జట్టు ఆస్టేల్రియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో తలపడనున్న నేపథ్యంలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్‌ కీపర్ల జాబితో ధోనీ నంబర్‌వన్‌ స్థానాన్ని అధిరోహిస్తాడు.  జాబితాలో సౌతాఫ్రికా మాజీ వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్‌ 596 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతని తర్వాత ధోని (594) తర్వాతి స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర 499 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉండగా.. 485 మ్యాచ్‌లతో ఆస్టేల్రియా మాజీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇటీవల ఆస్టేల్రియా  టూర్‌లో ఆసీస్‌తో టీ20ల్లో మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి.. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫామ్‌ అందుకున్న మహీ స్వదేశంలో కంగారూలతో సిరీస్‌లోనూ విశేషంగా రాణిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.