మరో వారంలో.. తమ ఆశయం నెరవేరుతుంది
– అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్, ఫిబ్రవ7(జనంసాక్షి) : మరో వారంలో సిరియాలో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను అంతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, తద్వారా ఉగ్రవాదులను అంతమొందించాలనే తమ ఆశయం నెరవేరుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ట్రంప్ ప్రసంగించారు. సుమారు 70దేశాల ప్రతినిధులో ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా… అమెరికా, దాని మిత్ర దేశాలతో పాటు సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ కృషి కారణంగా.. ఐఎస్ పాలనలో ఉన్న సిరియా, ఇరాక్‌లోని చాలా ప్రాంతాలు విముక్తి పొందాయని, చాలా కష్టంతో కూడుకున్న ఈ పనిని పూర్తి చేసేందుకు ఆర్థిక, సైనిక సహకారాలు అందించి సిరియాకు అండగా నిలిచారన్నారు. ఇది సమిష్టి కృషి అని, ఐఎస్ ఉనికిని సమూలంగా రూపుమాపుతామన్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లోగా అధికారిక ప్రకటన చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా సిరియా నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు గతేడాది డిసెంబరులో ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఐఎస్‌ను పూర్తిగా ఓడించిన కారణంగా సైనిక దళాలను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించారు. ఈమేరకు సిరియాలో ఐఎస్‌ను ఓడించాం.. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం ఇది అని ఆయన ట్వీట్ చేశారు.