మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌

అప్రమత్తం అయిన కర్నాటక ప్రభుత్వం
విదేశీయుల రాకపై మరోమారు ఆంక్షలు
బెంగళూరు,అక్టోబర్‌28 జనం సాక్షి : కొవిడ్‌ వైరస్‌ మళ్ళీ విజృంభిస్తున్న వేళ కర్నాకట మరోమారు అప్రమత్తం అయ్యింది. కొవిడ్‌ వైరస్‌ కొత్తరూపం దాల్చిందని ఎవై 4.2 రూపంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని బీబీఎపీ కమిషనర్‌ గౌరవ్‌ గుప్తా వెల్లడిరచారు. రూపాంతరం చెందిన ఈ కొత్త వైరస్‌
నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బెంగళూరులో ముగ్గురు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏడుగురి లో ఈ కొత్త తరహా వైరస్‌ లక్షణాలు కనిపించాయన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్త వైరస్‌ వదంతుల నేపథ్యంలో నగర ప్రజల్లో జాగృతి రేకెత్తిందుకు బీబీఎంపీ తరుపున మార్షల్స్‌ను రంగంలోకి దింపున్నామన్నారు. ప్రజలు భౌతిక దూర పాటించేలా వీరు జాగృతి చేపడతార న్నారు. ముందుజాగ్రత్తగా మాస్కులు ధరించాలని ఆయన ప్రజలను కోరారు. ఇదే క్రమంలో కొన్ని దేశాల నుంచి ప్రజల రాకపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొవిడ్‌ కేసులు అధికంగా ఉన్న బ్రిటన్‌, చైనా, బంగ్లాదేశ్‌ తది తర తొమ్మిది దేశాల నుంచి కర్ణాటకలోకి ప్రవేశించేవారు తప్పనిసరిగా కొవిడ్‌ నెగిటివ్‌ నివేదిక చూపించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ బెంగళూరులో బుధవారం విూడియాకు చెప్పారు. కొవిడ్‌ సాంకేతిక సలహా కమిటీ సూచన మేరకు ఈ ఆదేశాలను తక్షణం అమలులోకి తెచ్చామన్నారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న తొమ్మిది దేశాలకు చెందిన ప్రయాణీకులు కొవిడ్‌ నెగిటివ్‌ పరీక్షల నివేదిక వెంటతెచ్చుకోకపోతే క్వారెంటైన్‌కు వెళ్ళాల్సి వుంటుందన్నారు. బ్రిటన్‌, దక్షణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిల్యాండ్‌ దేశాల నుంచి వచ్చేవారికి ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. నెగిటివ్‌ నివేదిక చూపకపోతే విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహించి ఏడు రోజుల క్వారెంటైన్‌కు పంపడం జరుగు తుందన్నారు. 72 గంటల అవధి మించని ఆర్‌టీపీసీఆర్‌ నివేదికలను ప్రయాణీకులు విమానాశ్ర యంలోనే అధికారులకు చూపించాల్సివుంటుందన్నారు. రెండు వ్యాక్సిన్‌లను వేయించుకున్న ప్రయాణీకులు సైతం ఈ నబంధనలు పాటించాల్సివుంటుందన్నారు. ముందు జాగ్రత్తగా కర్ణాటక ఆరోగ్య శాఖ విదేశాల నుంచి ప్రతి ప్రయాణీకుడి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక నిఘా విధిస్తుందన్నారు.