మహారాష్ట్రలో ఘోరం


` బాలికపై గ్యాంగ్‌రేప్‌
` 15ఏళ్ల బాలికపై 29మంది ఏడాదిగా అత్యాచారం!
` ఇద్దరు మైనర్లతోసహా 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
` నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు
ముంబయి,సెప్టెంబరు 23(జనంసాక్షి): మహారాష్ట్రలో మరో ఘోరం వెలుగుచూసింది. ఇటీవల ముంబయిలో నిర్భయ తరహా ఘటనను ఇంకా మరిచిపోకముందే.. ఠాణే జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పదిహేనేళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా 29 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడుతున్న పాశవిక ఘటన కలవరపెడుతోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. నిందితుల్లో ఇద్దరు మైనర్‌ బాలురు ఉండటం గమనార్హం. వారంతా ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి, బెదిరించి ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్లు బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.డోంబివలీలోని మన్పడా పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలి స్నేహితుడు, ఈ ఘటనలో ప్రధాన నిందితుడు.. తొలుత ఈ ఏడాది జనవరిలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వీడియో తీశాడు. ఇది కాస్త మరో వ్యక్తి వద్దకు చేరడంతో.. అతను ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. వీడియోను బయటపెడతానని బెదిరించి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఈ ఏడాది సెప్టెంబరు వరకు 29 మంది తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.ఈ వ్యవహారంపై స్థానిక ఏసీపీ దత్తాత్రేయ కరాలే మాట్లాడుతూ.. ‘ఫిర్యాదు అందిన వెంటనే మేం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాం. ఇప్పటివరకు ఇద్దరు మైనర్లతోసహా 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నాం. నిందితులంతా బాధితురాలికి, ప్రధాన నిందితుడికి తెలిసినవారే. వారంతా ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ, వివిధ సందర్భాల్లో లైంగిక దాడికి పాల్పడ్డారు’ అని వివరించారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పారు. నిందితుడు చిత్రీకరించిన వీడియోతో సహా ఇతర ఆధారాలను దర్యాప్తు బృందం సేకరిస్తోందన్నారు. ప్రధాన నిందితుడే ఆ వీడియోను ఇతరులకు పంపాడని పేర్కొన్నారు.