మహిళా బిల్లు కోల్డ్‌ స్టోరేజీ దాటేనా

ఈ శీతాకాల సమవేశాల్లో అయినా చర్చించేనా

బిల్లుపై మౌనమే సమాధానంగా ప్రధాని మోడీ తీరు

న్యూఢిల్లీ,నవంబర్‌15(జ‌నంసాక్షి): మోడీ హయాంలో బిజెపి ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలనాకి చేరువగా ఉంది. మరోమారు డిసెంబర్‌ 11 నుంచి పాలరమెంట్‌ సమావేశాలు జరగబోతున్నాయి. ఆలయాల్లో మహిళల పట్ల వివక్ష లేకుండా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. అయినా ఎందుకనో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోల్డ్‌ స్టోరేజీ దాటి రావడం లేదు. సంపూర్ణ మెజార్టీ ఉన్నా మహిళా బిల్లుకు మాత్రం మోక్షం దక్కలేదు. దీనిని గట్టెక్కించడంలో కనీసం ప్రస్తావన కూడా జరగలేదు. మోడీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయ్యాయి. మరో ఆరునెలల్లో ఎన్నికలు సవిూపిస్తున్నా దీని ఊసెత్తడం లేదు. బిజెపి కూడా మహిళా బిల్లును తీసుకుని రాలేకపోయిందన్నదే జీర్ణించుకోలేని వ్యవహారంగా నిలిచిపోనుంది. మహిళా బిల్లును ఆమోదించక పోవడం బిజెపి ఘోర వైఫల్యంగానే చూడాలి. మహిళలు ఎంతోకాలంగా రాజకీయ రిజర్వేషన్లు చట్టబద్దంగా కావాలని కోరుకుంటున్న మహిళా బిల్లుపై తన వైఖరిని ప్రభుత్వం స్పష్టం చేయడం లేదు. భారత రాజకీయాల్లో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నా గత రెండు దశాబ్దాలుగా మహిళా బిల్లు మాత్రం గట్టెక్కలేకపోతోంది. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ ఉన్నా మోడీ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడం లేదు. మోడీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు దాటి, మళ్లీ ఎన్నికలకు వెళ్లే రోజులు వచ్చాయి. బేటీ పడావో..బేటీ బచావో అన్న నినాదాలు చేస్తున్నా మహిళలకు రాజకీయ అవకాశాలు రావాలని కోరుకోవడం లేదు. మహిళా సమానత్వమే సమాజానికి హితం చెబుతున్న పాలకులు సమాన గౌరవం ఇచ్చి చట్టసభల్లో ప్రవేశించేలా చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. మహిళల్లో స్ఫూర్తిని నింపడమే గాకుండా, వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపి వారిని మనతో సమానంగా ముందుకు తీసుకుని వెళ్లడంలో పురుష సమాజం విఫలమయ్యిందనడంలో సదేహం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షలపై స్పందించడం లేదు. త్వరలోనే మహిళల రిజర్వేషన్లపై ముందుకు సాగుతామన్న ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. పాలనలో వారికి భాగస్వామ్యం కల్పించకుండా వారిని అణగదొక్కే కుట్రల్లో బిజెపి కూడా ముందే ఉంది. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఎందుకనో రాజకీయంగా ముందుకు సాకుండా అణగదొక్కు తున్నారు. ఇలా వారిని అణచి వేయడం వల్ల 50శాతం జనాభా ఆకాంక్షలను కాలరాస్తున్న వారు అవుతున్నారు. చట్టసభల్లో మూడోవంతు రిజర్వేషన్లు ఎవరి దయాధర్మంగానో కాకుండా హుక్కుగా, సగౌరవంగా లభించాల్సి ఉందని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నిర్మొహమాటంగానే అన్నారు. మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించినప్పుడే సామాజిక ప్రగతి సాధ్య పడుతుందన్నారు. ఏకాభిప్రాయ సాధన, ఉపకోటా పేరిట ఇంతకాలం రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పటికే రాజ్యసభామోదం పొందిన మహిళాబిల్లుకు లోక్‌సభలో మద్దతు పలికే పార్టీల్ని కూడగట్టే యత్నాలను చేయాలి. మహిళల హక్కుల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోకుండా చూడాలి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఏటా జరుపు కుంటున్నా, మహిళలకు సమానహక్కులు, వారికి ప్రాతినిధ్యం వంటి విషయాల్లో ఇంకా మనం వెనకబడే ఉన్నాం. వారిని ముందుకు వెళ్లకుండా వెన్నక్కి నెట్టేస్తూనే ఉన్నాం. మహిళా బిల్లుతో రాజకీయాల్లో రాణిస్తే భారత సమాజం తీరు కూడా మారుతుందనడంలో సందేహం లేదు.