మాతాశిశు సంరక్షణకు చర్యలు
క్షేత్రస్థాయిలో శిక్షణా కార్యక్రమాలు
వరంగల్,నవంబర్9 (జనం సాక్షి): మాతా శిశు మరణాలను తగ్గించి మానవ అభివృద్ధి సూచికను పెంపొందించ డానికి సెర్ప్ నడుం బిగించింది. ఐసీడీఎస్, మెడికల్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పౌష్టికాహారం, పరిశుభ్రత, మంచినీరు, విద్య వంటి అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో పైలట్‌గా తీసుకున్న ఏడు మండలాల సంఘాల సభ్యులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ వేయిరోజుల ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు గర్భం దాల్చినప్పటి నుంచి శిశువుకు రెండేళ్ల వయసు వచ్చే వరకు వేయి రోజుల పాటు ఈ శిక్షణ గ్రామాలలో కొనసాగుతుందని డీఆర్‌డీవో సూర్యనారాయణ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా త్వరలోనే అన్ని మండలాల్లో ప్రత్యేక కార్యక్రమంగా దీనిని చేపడుతున్నట్లు వెల్లడించారు. మహిళలకు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఈ శిక్షణ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మహిళలు గర్భం దాల్చిన రోజు నుంచి బిడ్డకు రెండేళ్ల వయసు వయసు వచ్చే వరకు ఇలా వెయ్యి రోజుల కార్యాచరణను అమలు చేస్తారు. గర్భిణులు ప్రసవమయ్యేంత వరకు తీసుకోవాల్సిన పోషకాహారం, ప్రసవానంతరం ఏడాది పాటు చిన్నారికి ఇవ్వాల్సిన టీకాలు, మందులపై అవగాహన కల్పిస్తారు. ఏడాది నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఇవ్వాల్సిన ఆహారంపై శిక్షణ ఇస్తారు. వేయిరోజుల ఆరోగ్య పరిరక్షణ కింద ఏపీఎం, సీసీలు, వీఏవోలకు శిక్షన కొనసాగుతోంది…వీరందరికీ రిసోర్స్ పర్సన్స్ శిక్షణిస్తారు. వారే మండల సిబ్బందికి, మండల సిబ్బంది ఆయా గ్రామపంచాయతీల్లో మహిళలకు అవగాహన కల్పిస్తారు. యుక్త వయస్సు ఆడపిల్లల ఆరోగ్యం, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు మానసిక, శారీరక పెరుగుదల సరిగా ఉండాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. ఇందుకోసం జిల్లాలోని ఏడు మండలాలను పైలట్ మండలాలుగా ఎంపిక చేసి, ఆటపాటలతో సంఘ మహిళలకు శిక్షణ అందించడానికి అవసరమైన శిక్షణ మెటీరియల్‌ను తయారు చేసి కిట్‌లను ప్రతీ వీఏవో, సీసీలకు అందించడం జరిగింది. వీరు ప్రతినెలా ఒక టాపిక్‌పై 3,4 సంఘాలకు ఒక సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తారు. మహబుబాబాద్ జిల్లాలో పైలెట్ మండలాలుగా నర్సింహులపేట, దంతాలపల్లి, డోర్నకల్, కురవి, బయ్యారం, మరిపెడ, చిన్నగూడూరు, మండలాలను ఎంపిక చేశారు. మిగతా 9మండలాలల్లో వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. జిల్లాల్లోని డీఆర్‌డీఏ-ఐకేపీ సంఘాల ఆధ్వర్యంలో ఆయా మండలాల పరిదిలో ఉన్న ఏపీఎంలు, సీసీలు, వీఏవోలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ శిక్షణ కొనసాగుతోంది. గ్రామపంచాయతీల్లో సెర్ప్ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు ప్లకార్డులు, పామునిచ్చెన, తల్లిపాల ప్రాధాన్యం, చేతుల శుభ్రత విధానం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతి శిక్షకుడికి ఒక కిట్‌ను అందజేస్తారు. ప్రసవమైన తర్వాత చిన్నారికి టీకాలు, పోషకాహారం, చక్కగా అందిస్తే వారిని స్టార్ అమ్మగా పిలుస్తారు. సంఘం సమావేశాల్లో ఆమెతోనే శిక్షణ ఇప్పిస్తారు. పుట్టిన చిన్నారికి వెంటనే ముర్రిపాలు తాగించడం, ఆరునెలలు నిండగానే తల్లిపాలతో పాటు, తగినంత అనుబంధ పోషకాహారం, తరచుగా కొద్దికొద్దిగా చిన్నారికి తినిపించడం, విటమిన్ ఏ ద్రావణం 5నెలల నుంచి అందించడం, అయోడిన్ ఉప్పును వాడటం, ఏడాదిలోపు క్రమం తప్పకుండా అన్నిరకాల టీకాలను అందించడం, శిశు సంరక్షణ విషయంలో
చేతులను శుభ్రంగా కడుక్కునే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.