మానవత్వం మంటగలిసింది

దుండుగుల దాడిలో విశ్రాంత ఎస్‌ఐ కన్నుమూత

అలహాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): మానవత్వం మరోమారు కనుమరుగయ్యింది. కళ్లెదుటే కొట్టిచంపుతున్నా పట్టించుకోలేదు. చివరకు ఓ విశ్రాంత ఎస్‌ఐ దుండగుల దాడిలో కన్నుమూశాడు.నడిరోడ్డుపై ఓ పెద్దాయనను నిస్సహాయుడిని చేసి కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నా.. అటుగా వెళ్తున్న వారు కళ్లప్పగించి చూశారే తప్ప కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జరిగిందీ దారుణం. పైగా ఈ ఘటనలో బాధితుడు ఓ విశ్రాంతి ఎస్సై కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలహాబాద్‌కు చెందిన అబ్దుల్‌ సమద్‌ఖాన్‌ యూపీ పోలీస్‌ శాఖలో విధులు నిర్వహిస్తూ 2006లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా రిటైర్‌ అయ్యారు. సమద్‌ఖాన్‌ సోమవారం తన సైకిల్‌పై వెళ్తుండగా.. ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి అతడిపై కర్రతో దాడి చేశాడు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు కూడా చేరుకుని సమద్‌ఖాన్‌ను తీవ్రంగా కొట్టారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. దాడి జరిగే సమయంలో చాలా మంది తమ వాహనాలపై అటుగా వెళ్లారు. అయినా ఏ ఒక్కరూ నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా వాహనాలను ఆపి మరి చోద్యం చూసినట్లు చూశారు. సమద్‌ఖాన్‌ స్పృహ కోల్పోయే వరకు దాడి చేసిన నిందితులు అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సమద్‌ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందారు. కాగా.. ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో స్థానిక విూడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకడిని పాత నేరస్థుడు జునైద్‌గా గుర్తించారు. బంధువులతో ఆస్తి తగాదాల వల్లే సమద్‌పై దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

——–